ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసపెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి విషయంలో అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో నిధుల ప్రస్తావన తీసుకురాలేదు. ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బ్యాంకు నిరాకరించి వారం రోజులు కూడా గడవకుండానే... ఇప్పుడు మ‌రో బ్యాంకు సైతం రుణం విషయంలో చేతులు ఎత్తేసింది. 


అమరావతి ప్రాజెక్టుకు 200 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేది లేదని మంగ‌ళ‌వారం చైనా ఆధిపత్యంలోని ది ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(AIIB)తేల్చి చెప్పింది. ఓ న్యూస్ ఏజెన్సీకి పంపిన ఈ మెయిల్‌లో ఆ బ్యాంకు ప్ర‌తినిధి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఐదు రోజుల వ్యవధిలో రెండు కీలక బ్యాంకులు అమరావతికి ఇచ్చే రుణంపై వెనుకడుగు వేయడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పురోగ‌తిపై నీలినీడలు కమ్ముకున్నాయి.


ఉన్నంతలో రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో తాము వెనక్కి తగ్గినట్టు ప్రపంచ బ్యాంకు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్ర‌పంచ‌బ్యాంకు రుణం నిలిపివేయ‌డంతో ఏపీలో రాజ‌కీయంగా పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. ఇప్పుడు ఏషియ‌న్ బ్యాంకు సైతం వెన‌క్కు త‌గ్గ‌డంతో ఇది ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ఛాన్స్ ఇచ్చేదిగా మారింది.


వాస్త‌వంగా గ‌తంలో అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌తో ఉండ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా అమ‌రావ‌తినే అభివృద్ధి చేసే ప్ర‌ణాళిక ఏదీ పెట్టుకోలేదు. అన్ని అంశాల‌ను స‌మానంగా అభివృద్ధి చేసేలా ముందుకు వెళుతోంది. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తికి రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: