వారిద్దరికి నాలుగేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తరువాత వారి పరిచయం కాస్త ప్రేమ వివాహానికి దారితీసింది. కొన్నేళ్ల తరువాత పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణలకు పాల్పడ్డారు. ఈమేరకు విజయవాడకు చెందిన బాధిత మహిళ సోమవారం గుంటూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో తమ ఆవేదన తెలియజేసి న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. నేను విజయవాడలో బ్యూటీషియన్‌గా జీవిస్తున్నాను. నాలుగేళ్లు కిందట పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్‌ వినయ్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 

కొంత కాలం ఇద్దరం స్నేహపూర్వకంగా ఉన్నాం. తరువాత అతను నన్ను ప్రేమిస్తున్నానని..పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గతంలో నాకు వివాహం జరిగి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నట్లు అతనికి తెలియజేశాను. అయినప్పటికీ నేను వివాహం చేసుకుంటాను. తరువాత మా కుటుంబీకులకు నచ్చజెప్తానంటూ హామీ ఇచ్చాడు. దీంతో గతేడాది  ఇరువురి ఇష్టపూర్వకంగానే తిరుపతి వెళ్లి ఒక ఆలయంలో వివాహం చేసుకుని విజయవాడలో నివాసం ఉండేవాళ్లం. కొద్ది రోజుల తరువాత నేను ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఈ వివాహం గురించి తెలియజేసి నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్తానని అతను నమ్మబలికాడు. 

ఇంతలో అతనికి ఇంతక ముందే వేరే మహిళతో వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారని, మా అబ్బాయిని వదిలేయాలంటూ అతని తండ్రి ఫోన్‌లో నన్ను సంప్రదించాడు. కాలం గడుస్తున్నా వీరయ్య  నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేను మా తల్లి స్నేహితురాలితో కలిసి పిడుగురాళ్లలోని అతని ఇంటికి వెళ్లాం. మహిళలం అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో వీరయ్య అతని కుటుంబీకులు మాపై దాడులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు అతను అడిగినప్పుడల్లా రూ.3.5 లక్షలు అందించాను. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని పిడుగురాళ్లలో పోలీసుల్ని ఆశ్రయించగా వారు పట్టించుకున్నదే లేదని, ఈ విషయంలో నాకు రక్షణ కల్పించి వీరయ్యతోనే నా వివాహ బంధాన్ని కొనసాగించేలా చూసి న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో పోలీసుల్ని ఆశ్రయించానని ఆమె వెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: