ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. బలనిరూపణలో కుమారస్వామి ప్రభుత్వం విఫలమైంది. దీంతో కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.  15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడ‌గా...గత మూడువారాలుగా కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. దీంతో కుమార‌స్వామి రాజీనామా చేయ‌నున్నారు. అయితే, కుమారస్వామి బ్యాడ్‌ల‌క్ ఇది రెండో సారి.

 

 

 

2004లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కమారస్వామి సీఎంగా పనిచేశారు. అప్పుడు సైతం ఆయ‌న ప‌దవిని కోల్పోయారు. 2018 మే 16వ తేదీన కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరింది. మే 23వ తేదీన కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలకే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సీఎం పదవిని కుమారస్వామి రెండో సారి కోల్పోయారు. మెజారిటీ నిరూపించుకోవడానికి 103 మంది సభ్యులు అవసరం కాగా జేడీఎ - కాంగ్రెస్‌ లకు బలనిరూపణలో 99 ఓట్లు రాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. బలపరీక్షపై డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. అధికారులు ఒక్కొక్క సభ్యుడి వద్దకు వెళ్లి లెక్కింపు చేపట్టారు. ఆరు ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది.

 

ఇదిలాఉండ‌గా, కుమార స్వామి ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో 105 మంది సభ్యుల బలమున్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ వాజూబాయ్‌వాలా ఆహ్వానించనున్నారు. బలనిరూపణలో సంకీర్ణ ప్రభుత్వం విఫలం కావడంతో బీజేపీ శాసనసభ పక్షనేత యడ్యురప్ప సీఎం పీఠం చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: