క‌ర్ణాట‌క‌లోని త‌మ సార‌థ్యంలో గ‌ల విశ్వాస పరీక్షలో జేడీఎస్ నేత కుమార‌స్వామి సర్కారు కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే.కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది.


స‌భ‌లో చ‌ర్చ సందర్భంగా సీఎం కుమారస్వామి సభలో మాట్లాడుతూ ప్రసంగానికి తనకు 3 గంటల సమయం కావాలని స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్‌ను కోరారు. త్వరగా ప్రసంగం ముగించాలని సీఎం కుమారస్వామికి స్పీకర్ సూచించారు. అసెంబ్లీలో కుమారస్వామి భావోద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నారు. తాను సంతోషంగా పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చర్చ సందర్భంగా కుమారస్వామి స్పష్టం చేశారు. ``నేను కావాలని విశ్వాస పరీక్షను సాగదీయలేదు. స్పీకర్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నా. వ్యవసాయం నుంచి మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజల కోసం కష్టించి పనిచేయడమే మాకు తెలుసు. నేను ప్రభుత్వ కారు కూడా ఉపయోగించడం లేదు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయను. రాష్ట్రాభివృద్ధి కోసమే నిరంతరం శ్రమించా` అని అన్నారు. గెలిచినా, ఓడినా తానెక్కడికీ పారిపోవట్లేదని...రాజకీయ పరిణామాలతో విసిగిపోయానన్నారు. ప్రజలను, ప్రతిపక్షాలను వేచిచూసేలా చేసినందుకు కుమారస్వామి క్షమాపణలు చెప్పారు. 


కాగా, కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఓటమి పాలైన నేపథ్యంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ వాజూభాయ్‌వాలాకు రాజీనామాను సమర్పించారు. రాజీనామాను స్వీకరించిన గవర్నర్‌.. వెంటనే దాన్ని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, ఈ సమయంలో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని గవర్నర్‌ కుమారస్వామికి సూచించారు. అయితే, విశ్వాసపరీక్షలో ఓటమి తర్వాత అనంత‌రం మీడియాతో మాట్లాడిన కుమార‌స్వామి ఇన్నాళ్లు సహకరించిన మీడియాకు థ్యాంక్స్ అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: