'' అమ్ముడుపోయిన మీడియా పత్రికలు రాయడానికి, ప్రచారంచేయడానికేం, బాగానే చూపిస్తాయి ఒక నాయకుడిని ఆర్థిక నేరస్తుడిగా, ఒక నాయకుడిని పప్పుగాడిగా.. నమ్మే మనకుండాలి, నవ్వే మనకుండాలి! రాహుల్‌ గాంధీ సమర్థుడు కాకపోవచ్చు గానీ అసమర్థుడు కాదు. మతాల్ని రెచ్చగొట్టి, మారణహోమాలు రాజేసి, కోట్లు పోగేసి, అబద్దాలు ప్రచారం చేసి ప్రభుత్వాల్ని ఏర్పాటుచేయలేకపోయిన రాహుల్‌ గాంధీ రాజకీయాలకు పనికిరాడనిపిస్తే, వోట్లేసే మనం ప్రజాస్వామ్యానికి పనికిరామని అర్థం.

ఇప్పుడతడు ఎదుటిపార్టీనేగాక పార్టీలోపలి వ్యక్తుల్ని కూడా గెలవాల్సిన దుస్తితి. కొన్ని తరాలుగా పేరుకుపోయిన పనికిరాని భజనపరుల్నీ, పార్టీ మీద పడి బ్రతికే ముదుర్లనీ.. గాడిలో పెట్టడానికి అతడి రాజీనామా నిర్ణయం సమంజసమైనది. మధ్యప్రదేశ్‌ రాజస్థాన్‌ లలో యువకులకు కాదని ముసలినక్కలకే ముఖ్యమంత్రిపీఠాల్ని అప్పజెప్పాల్సిన దుస్తితికి ప్రతిఫలం పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిఫలించింది. చిదంబరం, అశోక్‌ గెహ్లాట్‌ వంటి నేతలు, తమ పిల్లలకు సీట్లకోసం పట్టుబట్టడం, వారి గెలుపుకోసమే శక్తియుక్తులు ధారపోయడం, వారి సీట్లకోసం బెదిరింపులకు దిగే పరిస్థితిలో పార్టీ, ప్రజలగురించి ఎవరు బాధ్యత తీసుకోగలరు? కరిగిపోతోన్న పార్టీ నిధులు, తరిగిపోతోన్న ఇమేజ్‌, కొడిగడుతోన్న వోట్‌ బ్యాంక్‌..లని ఎవరాపగలరు?

గాంధీ కుటుంబం నుండి వచ్చినవాళ్లని తప్ప మరెవరినీ ముందుపెట్టినా ఓట్లేయని జనమున్న అనివార్యతలో, పార్టీ ముక్కలైపోయే దుస్తితిలో, ముఖ్యంగా అటుపక్క గెలిచినా, గెలవకపోయినా అయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటుచేసే అధికారపార్టీ తెగింపుని ఇక అడ్డుకునేదెవరు? అసలు ఆ పార్టీ ఎన్నికయ్యిందే వోటింగ్‌ మెషీన్ల మేనేజ్మెంట్‌ అనే వాదనకు నిరూపణెవరు చేయగలరు? ఒకప్పుడు ప్రభుత్వాలు తమకు ఏమీ చేయలేదని ఆగ్రహించేవాళ్లు, ఇప్పుడు ఏం చేస్తుందోనని భయపడి చస్తున్నారు. సైన్యం, న్యాయం, ఆర్థికం, సామాజికంగా అవినీతి, దిగజారిన విలువల్తో పతనదిశగా దేశం వేగంగా జారిపోతున్నప్పుడు పాలిత ప్రభుత్వాల్ని నిలదీసే బుద్దిజీవుల్ని జైళ్లలో తోసేసి, కల్చేసి చంపుతున్నప్పుడు కనీస ప్రతిపక్షాన్ని నిలుపుకోలేకపోవడం మన దౌర్భాగ్యం.

చరిత్రల్ని సైతం కొత్తగా చూపించే వర్తమానంలో, వర్తమానాన్ని ఇష్టమొచ్చినట్లు చూపే మీడియా చేతిలో వున్నప్పుడు నాయకుల్ని జోకర్లుగా చూపడం పెద్ద కష్టం ఏమీకాదు. అటువంటివి చూసి నవ్వుకోవడం తప్పుగాదుగానీ, మన జీవితాలు నవ్వులపాలవుతున్నప్పుడూ తప్పు తెలుసుకునే బాధ్యతలేకపోవడమే బాధాకరం. పక్కనున్న కర్ణాటకంలో ప్రజాస్వామయం కనుమరుగైపోయాక తర్వాతివంతు బలిపీఠం మీద మేమే నిలబడివున్నం బిక్కుతూ!

రాహుల్‌! మమ్మల్ని మన్నించు, నీ ప్రమేయంలేకుండనే, నీ తండ్రిని పోగొట్టుకున్నావ్‌, నీతల్లి ఉనికి ప్రశ్నకునిలబెట్టుకున్నవ్‌, నీ వ్యక్తిగత జీవితం ప్రశ్నార్థకమైంది.. మమ్మల్ని నీ భుజాలమీద మోయాలని ఆశిస్తూనే, మోసే నీ భుజాలని అవహేళన చేస్తూ ఇక్కడ మిగిలివున్నాం! ఇంకొక పదేళ్లకంతా నీ విలువ మాకు బాగా అర్థమవుతుందనే నమ్మికతో.. సే లవ్‌.
( ప్రముఖ సామాజిక విశ్లేషకులు సిద్దార్ధి సుభాష్‌ చంద్రబోస్‌ విశ్లేషణ ఇది.)


మరింత సమాచారం తెలుసుకోండి: