అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి మంచి దూకుడు మీదున్నారు. దూకుడు ఏ స్ధాయిలో ఉందంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును నోరు కూడా ఎత్తేందుకు భయపడేంతగా ఉంది. దూకుడు మంచిదే కానీ మరీ ఇంతగా పనికా రాదు. ప్రతిపక్ష సభ్యుల విషయంలో ప్రధానంగా చంద్రబాబు విషయంలో మాట్లాడేటపుడు కాస్త సంయమనం చాలా అవసరం.

 

గడచిన ఐదేళ్ళ చంద్రబాబు  పాలన ఎంత అవినీతితో సాగిందో అందరికీ తెలిసిందే. సర్వ వ్యవస్ధలను చంద్రబాబు భ్రష్టుపట్టించేశారు. తన పాలనంతా కేవలం కొందరి కోసమే అన్నట్లుగా సాగింది. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి. కాబట్టి చంద్రబాబు అవినీతి గురించి జగన్ కొత్తగా జనాలకు చెప్పాల్సిందేమీలేదు.

 

పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ పిపిఏలు, రాజధాని నిర్మాణం లాంటి అంశాల్లో జరిగిన అవినీతిపై ఎలాగూ విచారణ కమిటిలను నియమించారు. కాబట్టి అవే అంశాలు అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు మళ్ళీ చంద్రబాబుపై విమర్శలకు, ఆరోపణలకు జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అండ్ కో పై చేయాల్సిన ఆరోపణలు, విమర్శలను  మంత్రులు, ఎంఎల్ఏలకు జగన్ వదిలిపెట్టేయాలి.

 

జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటానికే చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళకు సమాధానం చెప్పే అవకాశం జగన్ ఇతరులకు వదిలిపెట్టేయాలి. ముఖ్యంగా చంద్రబాబును చాలా చులకనగా, అమర్యాదగా మాట్లాడటం జగన్ కు కూడా గౌరవం కాదు. వయసుకైనా మర్యాదిచ్చి చంద్రబాబు మీద దూకుడును జగన్ తగ్గించుకోవాలి.  చంద్రబాబు మీదున్న కోపమంతా జగన్ తన మొహంలో చూపించటం ఏమాత్రం మంచిది కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: