సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారన్న  నెపంతో  ముగ్గురు టిడిపి శాసన సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది .   సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరడం , ఆ వెను వెంటనే శాసన సభాపతి స్థానంలో ఉన్న ఉప సభాపతి  కోన రఘుపతి ముగ్గురిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.


 సభ నుంచి సస్పెన్షన్ చేసిన తరువాత కూడా ముగ్గురు టీడీపీ సభ్యులు  సభ లోనే ఉంటూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో , వారిని   మార్షల్స్ బలవంతంగా  సభ నుంచి బయటకు గెంటి వేశారు.  సభ నుండి సస్పెండ్ అయిన తర్వాత టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను ఆరుసార్లు శాసనసభ ఎన్నికయ్యానని,  ఇంతవరకు ఒక్కసారి కూడా  సభా కార్యక్రమాలను నుండి సస్పెండ్ కు గురయింది లేదని  ఆవేదన వ్యక్తం చేశారు.


 సభానాయకుడిగా  వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కూడా తాను  సభలో ఉన్నానని,  రాజశేఖర్ రెడ్డి  చేయని పని ఆయన తనయుడు , ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారంటూ ఎద్దేవా చేశారు .   మాట తప్పను...  మడమ తిప్పను అంటూ పదే, పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల కు  ముందు ఆయన ఇచ్చిన హామీల ను సభలో ప్రస్తావించిన  టీడీపీ సభ్యులపై  ఎందుకు అంత కోపం అంటూ బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: