ఎపుడూ రోజులు ఒకేలా ఉండవు. అధినేతలకు కానికాలం వస్తే  ఇతర నాయకులు షాకులు ఇస్తారు. మరి అధినేతలకు కూడా అవకాశాలు వస్తాయి కదా. వారు అపుడు తామేంటో చూపిస్తారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన గత రెండు నెలలుగా ఎదురుదెబ్బలే తింటున్నారు. తమ్ముళ్ళు మరీ శ్రుతి మించి పోతున్నారు.


అయితే చంద్రబాబుకు ఈ తిరుగుబాట్లు ఓ విధంగా గుణపాఠాన్ని నేర్పుతున్నాయని అంటున్నారు. తనకు ఏవరు విశ్వాసపాత్రులో, మరెవరు జంపింగ్ జఫాంగులో తెలుసుకునేందుకు కూడా ఒక అవకాశం వచ్చినట్లుగా భావిస్తున్నారు. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉంది. ఓ రాజ్యసభ సీటు కానీ, ఎమ్మెల్సీ కానీ గెలిపించుకునే సంఖ్యాబలం ఆ పార్టీకి లేదు.


ప్రధాన ప్రతిపక్షంగా బాబుకు క్యాబినెట్ ర్యాంక్ హోదా దక్కింది. ఇక ప్రతిపక్షానికి సంబంధించి మరో కీలకమైన పోస్ట్ కూడా దక్కనుంది. అదే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్.  క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవి విపక్షంలో ఉన్న వారికి ఇస్తారు. ఈ పదవి కోసం టీడీపీలో చాలా పోటీ జరిగింది.
.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పదవి కోసం గట్టిగా ట్రై చేశారు. ఎటూ ఓడిపోయాక మంత్రి పదవి ఉండదు, కనీసం పీయేసీ చైర్మన్ గిరీ దక్కినా చాలు అని గంటా భావించారు. అందుకోసం బాబు వద్ద గట్టిగానే పైరవీ చేశారని ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు ఆ పదవిని ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చారు. 


పార్టీ కోసం ఏళ్ళ తరబడి పనిచేస్తూ మంత్రిగా కూడా అవకాశం పొందని పయ్యావుల కేశవ్ కి  ఇపుడు ఆ కీలకమైన పదవిని బాబు ఇస్తున్నట్లుగా తెలిసింది. పయ్యావుల కేశవ్ ను పీఏసీ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ప్రతిపాదనలు పంపారు. దాంతో గంటాకు గట్టి ఝలక్ తగిలిందని భావించాలి. అసెంబ్లీలో చంద్రబాబు తో పాటు గొంతు కలపకుండా పూర్తి మౌనం  పాటిస్తున్న గంటా ఇపుడు ఈ ఝలక్ తో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: