టిట్ ఫ‌ర్ టాట్‌...అదేనండి దెబ్బ‌కు దెబ్బ అంటే ఎలా ఉంటుందో...అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌న‌కు తెలియ‌జేసింది భార‌త‌దేశం. భార‌త‌దేశం అంటే కేవ‌లం రాజ‌కీయ‌నాయ‌కులు మాత్ర‌మే వ్య‌క్తీక‌రించే భావ‌న‌లు కాదు క‌దా? వివిధ మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లు, ప‌త్రిక‌లు వ్య‌క్తీక‌రించేది కూడా. తాజాగా అదే జ‌రిగింది. ఇటీవల జపాన్‌లోని ఓసాకాలో జీ20 సదస్సుకు హాజరైన సందర్భంగా జరిగిన భేటీలో.. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని మోదీ నన్ను కోరారు అంటూ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీన్ని వెంటనే భారత విదేశాంగ శాఖ ఖండించింది. కశ్మీర్ అంశాన్ని పాక్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది.  


అయితే, పార్ల‌మెంటులో హాట్ హాట్ చ‌ర్చ‌లు మాత్రం దీనిపై జ‌రిగాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సహా ఇతర విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని పార్లమెంట్‌కు హాజరై స్వయంగా జవాబివ్వాలని వాయి దా తీర్మానం ఇచ్చాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఒకవేళ ట్రంప్ వ్యాఖ్యలు నిజమైతే, ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టినట్టేనని మండిపడ్డారు. ప్రధాని సభకు వచ్చి ట్రంప్‌తో భేటీ సారాంశాన్ని వివరించాలని డిమాండ్ చేశారు. 
ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే, ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఘాటు కౌంట‌ర్ వేసింది.  మెక్సికో అధ్య‌క్షుడితో స‌మావేశం అయిన ప్ర‌ధాని మోదీ  ``అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో-అమెరికా మ‌ధ్య స‌రిహ‌ద్దు గోడ నిర్మాణం విష‌యంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాల‌ని న‌న్ను కోరారు. `` అంటూ వ్యాఖ్యానిస్తున్న కార్టూన్ వేసింది! త‌ద్వారా `కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని మోదీ నన్ను కోరారు ` అంటూ భార‌త‌దేశాన్ని ఇబ్బంది పెట్టిన విష‌యంలో అదే రీతిలో దెబ్బ‌కు దెబ్బ కొట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: