సైలెంట్ గా ఉండేవాళ్ల ని సహజంగా బుద్ధిమంతులు అంటాం అదే రాజకీయాల్లో అయితే ఇక ఆయన పనైపొయ్యింది అని తీసి పారేస్తాం.  కానీ ఒక్కోసారి ఆ సైలెన్స్ ఏ వైలెన్స్ గా మారుతుంది. పార్టీలకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు టిఆర్ఎస్ ఈ విషయాన్ని గ్రహించిందట. పార్టీలో యాక్టివ్ గా లేని సీనియర్ గులాబి కండువాల మీద నిఘా పెట్టేసిందట. ఇంతకీ హఠాత్తుగా టిఆర్ఎస్ హైకమాండ్ వాళ్లపై నిఘానేత్రం ఎందుకు తెరిచింది. 



అసలెవరా సైలెంట్ సీనియర్స్..?  మాజీ ఎంపీ "జితేందర్ రెడ్డి", మాజీ ఎంపీ "వివేక్", "సోమారపు సత్యనారాయణ" వీరిలో ఏ ఒక్కరిని టిఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు కానీ వీరంతా కారు దిగిపోయారు కాషాయ కండువా వేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ సైలెంట్ గా ఉన్న సీనియర్ల మీద ఎందుకు నిఘాపెట్టిందో అర్థమైంది కదా. సాధారణంగా పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించిన, నేతలను పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయడం ఎక్కడైనా సాధారణంగా జరిగేదే. అలా కాకుండా కాస్త అసంతృప్తిగా ఉన్న నేతలు దూకుడు తగ్గిస్తారు. సైలెంట్ అవుతారు.


పార్టీ అధిష్టానం కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని చూసి చూడనట్టు వెళతాయి. సరిగ్గా ఇక్కడే టీఆర్ఎస్ కి షాక్ మీద షాక్ తగులుతోంది. సైలెంట్ గా ఉన్న సీనియర్ లు కారు దిగిపోతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో అలాంటి వాళ్లు ఎవరు ఉన్నారు.? వాళ్ళు ఏం చేస్తున్నారు.? ఏ పార్టీతో ఐనా టచ్ లో ఉన్నారన్న దానిపై గులాబీ బాస్ నిఘా పెట్టారట. అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ లు దక్కని నేతలు, క్యాబినెట్ లో బెర్తు దక్కని నేతలు కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారట. అలానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరడంతో, అక్కడ ముఖ్య నేతలుగా ఉన్న గులాబీ కండువాలు కూడా సైలెంట్ గానే ఉంటున్నాయంట. 



వీరందరిపై టీఆర్ఎస్ నిఘా పెట్టిందట. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఈ మధ్య అంత చురుగ్గా వ్యవహరించడం లేదు. అలానే మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నరసింహరెడ్డి, చందూలాల్ లాంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించటంలేదు. వీరిలో చాలా మంది నేతలు బిజెపి కి టచ్ లో ఉన్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.


కడియం శ్రీహరి, జూపల్లి లాంటి నేతలు మేం పార్టీ మారడం లేదన్న వివరణలు కూడా ఇచ్చుకున్నారు. ఐతే జితేందర్ రెడ్డి నుంచి సోమారపు దాకా ఒక్కసారి మారడంతో టిఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ ఐపోయిందట. అటు కాషాయ కండువాలు కూడా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలపై ఫోకస్ పెడుతుంది. ఈ నేపధ్యంలో యాక్టివ్ గా లేని సీనియర్లంతా ఏం చేస్తున్నారన్న దానిపై నిఘా పెట్టిందట టిఆర్ఎస్ అధిష్టానం.


మరింత సమాచారం తెలుసుకోండి: