చూడబోతే వ్యవహారం అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా బిజెపి నేతలు చీలిపోయినట్లే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర నేతలు మెల్లి మెల్లిగా ఆరోపణలు, విమర్శలు ఎక్కు పెడుతున్న విషయం తెలిసిందే. తమ ప్రత్యర్ధి టిడికి కాదని వైసిపినే అని బిజెపి నేతలు స్పష్టంగా చెబుతున్నారు.

 

అదే సమయంలో జగన్ పరిపాలనకు అనుకూలంగా చంద్రబాబునాయుడుపై విరుచుకుపడుతున్నారు కొందరు కేంద్ర నేతలు. తాజాగా ఏపి ఇన్చార్జి సునీల్ థియోధర్ చేసిన కామెంట్లతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. థియోధర్ మాట్లాడుతూ  చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు.

 

త్వరలోనే చంద్రబాబు అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపుతుందని థియోధరే చెప్పేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే విద్యుత్ కొనుగోళ్ళ పిపిఏలు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి, రాజధాని అమరావతిలో అవినీతిపై నియమించిన కమిటి నివేదికలను కేంద్రానికి పంపమని థియోధర్ జగన్ కు చెబుతున్నట్లుగానే అందరికీ అర్ధమవుతోంది.

 

చంద్రబాబు అవినీతిపై ఆధారాలను జగన్ కేంద్రానికి పంపితే అప్పుడు కేంద్రం చర్యలు తీసుకుంటుందని సునీల్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సునీల్ వ్యాఖ్యలు చూస్తుంటే తొందరలోనే చంద్రబాబుపై సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించే అవకాశం ఉన్నట్లే అనిపిస్తోంది.  వైసిపికి కావల్సింది కూడా అదే కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: