గత అయిదేళ్ళు కొనసాగింది నారా వారి పాలన కాదని సారా పాలన అని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ ఇచ్చి ఓట్లు దండుకోవాలనుకున్న చంద్రబాబు కళ్ళల్లో ఉప్పు కారం కొట్టి మహిళలు మూలన కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ చట్టానికి సవరణలపై సభలో జరిగిన చర్చ సందర్భంగా టిడిపి పాలనని తీవ్రంగా తప్పుపట్టారు రోజా.



సభలో రోజా మాట్లాడుతూ, 
"తన సంతకాన్ని తానే అమలు చేసుకోలేని ఒక చేతగాని నిస్సహాయ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇంటింటికీ మినరల్ వాటర్ ఇచ్చారా లేదో గానీ, ఇంటింటికీ మద్యాన్ని మాత్రం ప్రవహింపచేశాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఇరవైనాలుగ్గంటలు చంద్రబాబు గారి పరిపాలనలో ఎనీ టైం మందు దొరికే ఏటీఎంలు మాత్రం కనిపించాయి అధ్యక్ష. మద్యానికి పేదల్ని బానిసలుగా మార్చి, వారి కష్టాన్ని, వారి రక్తాన్ని పీల్చి పిప్పిచేసారు అధ్యక్ష. ఇది నారా వారి పాలన కాదు ఇది సారా పాలన అని ప్రజలు ముద్ర వేసే విధంగా ఆయన పరిపాలించారు అధ్యక్ష. ఇలాంటి దౌర్భాగ్యమైన లిక్కర్ పోలసీ అమలుచేసారు కాబట్టే చంద్రబాబునాయుడిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కుక్కర్ లో వేసి, కుతకుత ఉడికించి, పిండి చేసి, ఉండ చేసి ఆ మూల కూర్చోబెట్టారని కూడా ఈ సందర్భంగా చెబుతున్న అధ్యక్ష. ఈయనకంటే మహిళలు ఇంకా తెలివైనవాళ్లు. ఆయనిచ్చిన పసుపు కుంకుమను తీసుకుని ఉప్పు కారం ఆయన కళ్ళల్లో కొట్టి ఆయనకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి ఆ మూలన కూర్చోపెట్టారు అధ్యక్ష." 


అని చంద్రబాబు నాయుడి పాలనను తీవ్రంగా విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: