ఎప్పటి నుంచో వివాదంగా మారిన ట్రిపుల్ తలాక్ గురువారం లోక్ సభలో ఆమోదం ముద్ర పడింది. తలాక్ బిల్లుకు సంబంధించి విపక్షాల నేతలు  ఆందోళన చేస్తున్నా ఆమోదం లభించింది. బిల్లుపై జరిగిన చర్చలో పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో కొంతసేపు సభలో గందరగోళం నెలకొంది. బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. విపక్షాల నిరసనల మధ్య బిల్లును సభ ఆమోదించింది. . లోక్‌సభలో ఈ బిల్లు పాస్‌ కావడంతో తదుపరి రాజ్యసభకు వెళ్లనుంది.

మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి సెషన్‌లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, డీఎంకే, జేడీ(యూ), పీడీపీ వంటి పలు పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరినా లింగ సమానత్వం, మహిళల హక్కుల పరిరక్షణ దిశగా బిల్లు ఆమోదం అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తూ జేడీ(యూ), తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు.

2017లో సుప్రీం కోర్టు ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించినా ఈ పద్ధతి కొనసాగుతుండటంతో ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు మతపరమైనది కాదని, మహిళా సమానత్వానికి సంబంధించిందని స్పష్టంచేశారు.

మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ ముస్లింలపై జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలను పెండింగ్‌లో పెట్టి ముమ్మారు తలాక్‌పైనే ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. తలాక్‌ బిల్లు వల్ల మహిళలే ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింలపై దాడులకు పాల్పడిన వారికి శిక్షలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. అదే విధంగా ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు


మరింత సమాచారం తెలుసుకోండి: