కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మోటార్లకు వచ్చిన కరెంట్‌ బిల్లు మోత మోగింది. తొలి కరెంట్‌ బిల్‌, చూస్తే మతిపోతుంది. 

భారీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కావటంతో దీనికి సంబంధించిన కరెంటు బిల్లు ఎంత వచ్చిందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ సమీపంలోని కన్నెపల్లి పంప్‌ హౌస్‌లో మోటార్లను ఆన్‌ చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు 5.7 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజీకి పంపింగ్‌ చేశారు.

దీనికి గాను, పంప్‌హౌస్‌ కరెంటు బిల్లు రూ.20.64 కోట్లకు చేరింది. దీంట్లో పాత బకాయిలు రూ.8 కోట్ల వరకు ఉన్నట్లు ట్రాన్స్‌కో ఇంజనీర్లు చెబుతున్నారు.ప్రతి నెలా 23వ తేదీన ట్రాన్స్‌కో ఇంజినీర్లు ఇక్కడ మీటర్‌ రీడింగ్‌ తీస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్‌కు 1.96 కోట్ల యూనిట్ల విద్యుత్తు వాడినట్లు తాజా రీడింగ్‌లో తెలిసింది. తెలంగాణ ఈఆర్‌సీ లెక్కల ప్రకారం లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు వాడుకునే విద్యుత్‌ ఒక్కో యూనిట్‌కు ఆరు రూపాయల చొప్పున బిల్లు లెక్కగట్టారు.

దీంతో ఈ నెలలో కన్నెపల్లి కరెంటు బిల్లు రూ.12.64 కోట్లు, అంతకు ముందు జూన్‌ 24 వరకు ఈ పంప్‌హౌస్‌ వద్ద టెస్టింగ్‌, డ్రై రన్‌, వెట్‌ రన్‌కు 14.15 లక్షల యూనిట్ల విద్యుత్తు వాడినట్లు తెలిసింది. ఈ బకాయిలన్నీ కలిపితే మొత్తం బిల్లు ఇరవై కోట్ల రూపాయలకు చేరుతుందని భూపాలపల్లి ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఉన్న ఒక్కో మోటార్‌ కెపాసిటీ 40 మెగావాట్లు. మోటార్‌ ఒక రోజంతా నడిపితే 2300 క్యూసెక్కుల నీటిని పంప్‌ చేసే వీలుంది. ప్రస్తుతం ఇక్కడ ఆరు పంప్‌ల ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసి అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. 23.7.2019 వరకు ఇక్కడి పంప్‌లు మొత్తం 859 గంటలు రన్‌ చేసినట్లు తెలిసింది. ఇక కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లు పూర్తి స్థాయిలో వాడితే ఈ బిల్లు అయిదు రెట్లకు పెరుగుతుందని అధికారుల అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: