ఉప్పు-నిప్పులా ఉండే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌టైపోయారా? ఈ ఇద్ద‌రు ఒక్క‌తాటిపైకి రాలేర‌ని భావించిన‌ప్ప‌టికీ క‌లిసిక‌ట్టుగా సాగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఎత్తులు, పైఎత్తుల్లో సుప‌రిచితులు అయిన ఈ ఇద్ద‌రు నేత‌లు తాజాగా ఒక్క‌తాటిపైకి వ‌చ్చేశారు. అమిత్‌షా అడ‌గటం...కేసీఆర్ ఓకే చెప్పేయ‌డం క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది. ప్ర‌త్యేక విమానంలో త‌న న‌మ్మిన‌బంటును కేసీఆర్ పంపించే అంత ప్ర‌త్యేక ప్రేమ పుట్టింది.


వివ‌రాల్లోకి వెళితే...సమాచార హక్కు చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుతో బీజేపీ-టీఆర్ఎస్‌ల మ‌ధ్య డీల్ కుదిరింది. బిల్లుపై అభ్యంతరం తెలుపుతూ విపక్ష సభ్యులు సవరణలను ప్రవేశపెట్ట‌గా...240 మంది సభ్యుల్లో స్వతంత్ర, నామినేటెడ్‌ సభ్యులతో కలిసి ఎన్డీఏకు 119 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ బుధవారం అయిదుగురు ఎంపీల పదవీకాలం ముగియడంతో బీజేపీ, దాని మిత్రపక్షాల సంఖ్యాబలం మెజారిటీకి ఆరు సీట్లు తక్కువ పడింది. దీనితో వైసీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేడీ, పీడీపీ సహా అనేక పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహకర్తలు చక్రం తిప్పారు.
బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందేలా చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ఇందుకు పావులు క‌దిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో అమిత్‌షా ఫోన్లో మాట్లాడారు. దాంతో టీఆర్ఎస్‌ వైఖరి బిల్లుకు పూర్తిగా అనుకూలంగా మారింది. అమిత్‌ షా ఫోన్‌ తర్వాత టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎంపీ సంతోష్‌ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోవడం విశేషం.


ఇంతేకాదండోయ్‌...టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు సైతం ఆస‌క్తిక‌ర రీతిలో వ్య‌వ‌హ‌రించారు. .స‌వరణలను వ్యతిరేకిస్తానని రెండు రోజుల క్రితం ప్రకటించి, సెలెక్ట్‌ కమిటీని నియమించాలంటూ ప్రతిపక్ష ఎంపీల లేఖపై సంతకం పెట్టిన కేకే గురువారం అనూహ్యంగా వైఖరి మార్చుకున్నారు. ఆర్టీఐ సవరణను తాను విముఖంగానే సమర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది, ప్రజాసమస్యల శాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ను కలిసి చర్చించానని, ఆయన ప్రభుత్వ వైఖరి ని వివరించిన తర్వాత తన దృక్పథం మారిందని సభలో కేకే వివరించారు. సెలెక్ట్‌ కమిటీకి బిల్లును అప్పగించాలంటూ విపక్షాలు రాసిన లేఖ నుంచి టీఆర్‌ఎస్‌ ఉపసంహరించుకుందని కేకే చెప్పడం గమనార్హం. మొత్తంగా అమిత్  షా ఎంట్రీతో సీన్ పూర్తిగా మారింద‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: