కేవలం డిగ్రీ, కొన్నిచోట్ల ఇంటర్ విద్యార్హతతో ఏపీ సర్కారు గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఒక లక్ష 28 వేల 589 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.


ఈ ఉద్యోగాల కోసం సెప్టెంబర్ లో రాత పరీక్ష ఉంటుంది. శనివారం నుంచి ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 8 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఉద్యోగాలకు చాలా చోట్ల డిగ్రీ.. కొన్ని గ్రామాల్లో ఇంటర్.. మరికొన్ని గిరిజన గ్రామాల్లో పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు.


అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల అప్పటికల్లా ఆయా గ్రామ సచివాలయాల్లో వీరంతా విధుల్లో చేరాల్సి ఉంటుంది. వీరికి శిక్షణాకాలంలో స్టయిఫండ్ గా రూ. 15 వేల రూపాయలు ఇస్తారు. రాతపరీక్షలో ఎంపికైన వారికి బాపట్ల, సామర్లకోట, కాళహస్తిలోని పంచాయతీ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నారు.


సెప్టెంబ‌రు 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌక‌ర్యాల‌తో స‌చివాల‌యాలను సిద్ధం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. నియామకాలు పొందినవారికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. పంచాయతీ సెక్రటరీలకు ఈగ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: