కేంద్రంలో రెండవ మారు అధికారంలోకి రావడం కాదు కానీ బీజేపీ వూపుడు అలా ఇలా లేదు. ఏపీలో నోటా కంటే కూడా ఓట్లు తక్కువ తెచ్చుకున్న ఆ పార్టీ తెగ హడావుడి చేస్తోంది. రేపటి ఎన్నికల్లో మేమే విజేతలం అంటూ లేని బలాన్ని వూహించుకుంటోంది. 2024లో పవర్ మాదే అంటూ సవాల్ విసురుతోంది. ఫిరాయింపు నేతలను పక్కన పెట్టుకుని జబర్దస్త్ చేస్తోంది. ఇక జగన్ మీద ఓ రేంజిలో బీజేపీ విరుచుకుపడుతోంది.


మరి దీన్ని చూస్తూ జగన్ వూరుకుంటారా అన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న. ఏపీలో పాలన బాలేదని కన్నా లక్ష్మీనారాయణ అంటే, చంద్రబాబుకు జగన్ కు అసలు తేడాయే లేదని పురందేశ్వరి  గొంతు పెంచుతున్నారు. జగన్ తన పాలనతో జనాన్ని భయపెడుతున్నారని అంటారు సీనియర్ నేత రాం మాధవ్. మరి ఎందుకిలా జగన్ మీద ఒక్కసారి దాడి చేస్తున్నారన్నది అంతు చిక్కని ప్రశ్న. 


టీడీపీ కంటే దారుణంగా జగన్ని తిడుతూ కమలనాధులు చేస్తున్న హడావుడికి వైసీపీ నేతలు మండిపోతున్నారు. ఏపీలో ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవలేని బీజేపీ అన్నేసి మాటలు అంటూంటే భరించడమా అని గుస్సా అవుతున్నారు. దీని మీద వారంతా కలసి జగన్ తో బీజేపీ వ్యవహారం గురించి చెప్పుకొచ్చారట.


జగన్ సైతం బీజేపీ దూకుడుని గమనిస్తూనే ఉన్నారట. జగన్ ఈ విషయంలో తన పార్టీ నేతలకు ఒక్కటే మాట చెప్పారట. ఏపీలో బీజేపీ బలం ఏమీ కొత్తగా పెరగలేదు. ఆ పార్టీ నేతల సందడి అంతా మీడియాలోనే అందువల్ల వారు మీడియా బేబీల అవతారం ఎత్తి నానా మాటలు అంటున్నా  మనం రెస్పాండ్ కావద్దు. బీజేపీ ట్రాప్ లో వైసీపీ నేతలు ఎవరూ పడవద్దు. ఒక్క మాట కూడా ఆ పార్టీ నాయకులను అనవద్దు.


కనీసం రెస్పాండ్ కావద్దు, మన పని మనం చేసుకుని పోదాం, జనం మన వైపు ఉన్నారంటూ జగన్ తన పార్టీ నేతలకు డైరెక్షన్ ఇచ్చారట. బీజేపీ ఎంతగా రెచ్చగొట్టినా వైసీపీ నుంచి స్పందన లేకపోతే ఆ పార్టీ అలాగే వూరుకుండిపోవాల్సివస్తొంది. ఇదీ జగన్ మాస్టర్ ప్లాన్. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాగే చంద్రబాబు మీద బీజేపీ నేతలు మాటలతో దాడులు చేశారు. దానికి తమ్ముళ్ళు  అతిగా రియాక్ట్ కావడం వల్ల బీజేపీ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుందని కూడా జగన్ అంటున్నారుట.


మనం అలాటి పొరపాటే చేయవద్దు. మనకు రాష్ట్రం ముఖ్యం, మన హక్కులను కేంద్రం వద్ద నుంచి సామరస్యంగా ఉంటూనే సాధించుకుందామని జగన్ చెబుతున్నారంటే వారేవా జగన్ మాస్టర్ ప్లాన్ అని అనిపించడంలేదూ. ఏమైనా  ఇకపై ఏపీ  బీజేపీ కి కంఠ శోష తప్ప వైసీపీ నుంచి నో రెస్పాన్స్ అన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: