టెన్షన్ లేని రోజంటూ ఉండదు రాజకీయాల్లో ఉంటే. పదవి రాకపోతే టెన్షన్. వచ్చిన పదవి నిలుపుకోవాలని టెన్షన్. గెలిస్తే ఒక టెన్షన్. గెలవక పోతే మరో టెన్షన్. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదోనని ఇంకో టెన్షన్. అధినేత మనసులో ఏముందోనని ప్రతీ నిముషమూ అదోరకం టెన్షన్. ఇలా టెన్షన్ మయం రాజకీయం.


దీనికి తోడు సరికొత్త టెన్షన్ ఇపుడు వైసీపీలో మొదలైందంట.  జమిలి ఎన్నికలు ఆరు నూరు అయినా పెట్టాలని కేంద్రంలోని మోడీ షాలు చూస్తున్నారు. ఇంతకన్నా మంచి తరుణం దొరకదు అన్నది వారి ఆలోచన. ఇప్పటికి దేశంలో 16 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. కర్నాటకలో యడ్యూరప్ప బలం నిరూపించుకుంటే 17 రాష్ట్రాలు అవుతాయి. ఎలాగైనా 20 పై ఛిలుకు  రాష్ట్రాలలో జెండా ఎగరేయాలన్నది మోడీ షాల పంతం.


అందుకోసం వారు 2022 ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ ఏడాది దేశం మొత్తం మీద లోక్ సభకు, అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు. అయితే ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి మాత్రం ఇది మింగుడుపడని వార్తే ఆ పార్టీ అయిదేళ్ల కాలానికి సరిపడ యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేసి పెట్టుకుంది.


ఏపీలో చూస్తే రాజధానికి ఒక రూపు రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కూడా మూడేళ్ళ సమయం సరిపోదు, అసలే  రాష్ట్రం నిండా అప్పుల్లో ఉంది. దానికి తోడు కేంద్ర సాయం కూడా లభించడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయ ఇబ్బందులు కూడా చాలానే ఉన్నాయి. టీడీపీ, బీజేపీ డైరెక్ట్ గా జగన్ని టార్గెట్ చేస్తున్నాయి.


ఇది జగన్ బాధ అయితే మరో వైపు ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం ఆరాటపడుతున్న వారికి జమిలి ఎన్నికలు ఇపుడు పెద్ద షాక్ నే ఇస్తున్నాయ‌ట. జగన్ మంత్రి వర్గం కూర్పు సమయంలో చెప్పిన మాట ఏంటంటే రెండున్నర ఏళ్లకు మళ్ళీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అపుడు మిగిలిన వారికి ఆ ఖాళీళ్లో చాన్స్ ఇస్తానని.


చూడబోతే మూడేళ్ళకే జగన్ సర్కార్ ముగిసిపోతే కొత్త మంత్రులకు ఇక చాన్సేది. ఇదీ ఇపుడు మంత్రి పదవుల కోసం వైసీపీలో కోటి ఆశలు పెట్టుకున్న వారికి కలుగుతున్న భయం. అదే వారికి పెద్ద టెన్షన్ గా ఉందిట. మంత్రి పదవులు ఆశ తీరకుండానే మళ్ళీ ఎన్నికలా అంటూ వారు నోళ్ళు వెళ్లబెడుతున్నారుట. మొత్తానికి జమిలి ఎన్నికలు జగన్ పార్టీకి పెద్ద షాకే ఇచ్చేట్టు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: