గత ఎన్నికల్లో ఘోరపరాజయానికి గురైన జనసేన పార్టీ పై అక్కడి నాయకులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ప్రకటించిన పార్టీ పోలిట్‌ బ్యూరో వల్ల పార్టీలో గూడుకట్టుకున్న అసంతృప్తి బయట పడుతోంది. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తాజాగా పార్టీ పోలిట్‌ బ్యూరో ఏర్పాటు చేశారు. అందులో లక్ష్మినారాయణ పేరు లేక పోవడంతో జనసేనతో ఆయనకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయనే ప్రచారం ఊపందుకుంది.

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ జనసేన పార్టీని వీడబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తి, సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న అధికారిగా గుర్తింపు ఉన్న జేడీని పోలిట్‌ బ్యూరోలో నియమించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 జేడీ లక్ష్మీ నారాయణ.. ఈ పేరు వినగానే జగన్‌ అక్రమాస్తుల కేసు గుర్తుకు వస్తుంది. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఆయన నిర్వర్తించిన విధులు ఎవరూ మర్చిపోలేరు. జగన్‌ కేసులు మాత్రమేకాక, ఓబులాపురం గనులు, సత్యం కుంభకోణం ఇలా పలు కీలక కేసులను చేపట్టి.. నిర్భయంగా దర్యాప్తు పూర్తి చేశారు. ముంబై అడీషనల్‌ డీజీపీగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాలు తిరిగి సమస్యలు అధ్యయనం చేశారు.

రాజకీయాల వైపు ఆయన అడుగులు పడుతున్నపుడు, బహుశ ఆయన బిజెపిలో చేరి ఎన్నికలలో పోటీ చేస్తారని, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు దేశం లోను చేరతారు అని మరో ప్రచారం జరిగింది. చివరికి జనసేన పార్టీలో చేరి విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే..
ఆయన టీడీపీలో చేరక పోవడానికి పలు కారణాలున్నాయి.

' రాజకీయాలలోకి రావాలని లక్ష్మీనారాయణకు 2014 నుంచి ఉంది. 2014 ఎన్నికలలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు. అయితే అప్పటి వరకు జగన్మోహన్‌రెడ్డిపై కేసులను దర్యాప్తు చేసి, ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరితే కేసులు బలహీనపడి వీగిపోతాయని మిత్రులు సలహా ఇవ్వడంతో ఆయన తన ఆలోచనను విరమించుకున్నారు.' అని రాజకీయ విశ్లేషకులు అంటారు.

దీనిని దృష్టిలో ఉంచుకునే, లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించే వారు. గతంలో తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ పెడుతూ, 'ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?' అని వ్యాఖ్యానించారు.

ఇపుడు జనసేన నుండి బయటపడ బోతున్న జేడీ భవిష్యత్‌ కార్యాచరణను వివరించడానికి త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారని తెలిసింది!!


మరింత సమాచారం తెలుసుకోండి: