ఇన్నాళ్లు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలఅమలు పై దృష్టి సారించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఇకపై పారిశ్రామిక పెట్టుబడులు ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు . పారిశ్రామికరంగాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని  జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు . ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగ యువతకు  గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన ఆయన , పారిశ్రామిక సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే . 


పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు కు  30 నుంచి 40 దేశాల రాయబారులు , కాన్సులేటు జనరళ్ళు , వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు . జగన్మోహన్ రెడ్డి వారితో  ముఖాముఖీ సమావేశమై  రాష్ట్రలో పెట్టుబడులకు ఉన్న అవకాశాన్ని  వివరించడంతోపాటు , రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ ని వివరించనున్నారు . రాష్ట్రం లో శాంతిభద్రతలు , పారదర్శక పాలనా , చౌకగా నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా వంటి అంశాలను ఈ సదస్సులో జగన్మోహన్ రెడ్డి విదేశీ ప్రతినిధులకు వెల్లడించనున్నారు .


ఆగస్టు 8వ తేదీన దక్షిణ కొరియా కు చెందిన కియా కంపెనీ నూతన కారు విడుదల చేయనుంది . అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని కంపెనీ ఆవరణ లో విడుదల చేయనున్న కియా కారు లాంచ్ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు . ఆ మరుసటి రోజే పారిశ్రామిక పెట్టుబడుల కోసం సదస్సు నిర్వహించడం ద్వారా,  సానుకూల సంకేతాలను పంపే ప్రయత్నాన్ని వైకాపా సర్కార్ చేస్తోంది .ఈ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి , రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని కొత్త పుంతలు తొక్కించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది . ఈ సదస్సు ద్వారా ఏ మేరకు రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు    వస్తాయో చూడాలి మరి . 


మరింత సమాచారం తెలుసుకోండి: