రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి త‌మ‌ను ఇబ్బంది పెడితే శ‌త్రుత్వం ఎలా పెరిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పైగా తాము క‌న్నేసిన సీటును కైవ‌సం చేసుకునేందుకు ఎదుటివారు అడ్డుపుల్ల వేస్తే స‌హ‌జంగానే వారిపై వేరే భావ‌న క‌లుగుతుంది. అనేక ఉదంతాల్లో ఇది సుస్ప‌ష్ట‌మైంది. తాజాగా పొరుగు రాష్ట్రమైన కర్ణాట‌క‌లో ఇదే జ‌రుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని సులభంగా పడగొట్టి గద్దెనెక్కుదామని బీజేపీ స్కెచ్చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ రాష్ట్ర స్పీకర్ రమేశ్‌కుమార్  ప్రభుత్వం పడిపోకుండా నెలరోజులపాటు కాపాడారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా కాషాయ పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. 


అయితే, అంతిమంగా విశ్వాస పరీక్షలో సంకీర్ణ సర్కార్ పతనమ‌వ‌డం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌డం తెలిసిన సంగ‌తే. సీఎం పీఠం ఎక్కిన బీజేపీ నేత యెడ‌యూర‌ప్ప కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌కుండా చేసిన స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ అడ్డు తొల‌గించుకునేందుకు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని అంటున్నారు. త‌న దృష్టి మంత్రివర్గ కూర్పు కన్నా.. స్పీకర్ రమేశ్‌కుమార్‌పైనే యెడ్డీ ఫోక‌స్‌ ఎక్కువగా ఉందంటున్నారు. గత `అనుభవాలకు ప్రతీకారం తీర్చుకోవడం`తోపాటు భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రమేశ్‌కుమార్‌ను గద్దె దింపాల్సిందేనని సీఎం భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.


కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మిగతా అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. ఒకవేళ స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేస్తే బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్ కూటములు మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి రెండు స్థానాలు అటుఇటుగా ఉంటాయి. ఇదే జరిగితే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని బీజేపీకి తెలుసు.  దీంతో బీజేపీకి భయం పట్టకుంది.  ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను మార్చాలని డిసైడైన‌ట్లు సమాచారం.


త‌మ దృష్టి మొత్తం సోమవారం జరుగనున్న బలపరీక్ష మీదే ఉంద‌ని, ఆలోగా స్పీకర్ స్వచ్ఛందంగా తప్పుకుంటారేమో చూస్తామ‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఒక‌వేళ త‌ప్పుకోక‌పోతే....బలపరీక్షలో నెగ్గిన తర్వాత.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నామ‌ని బీజేపీ ఎమ్మెల్యేలు మీడియాతో చెప్ప‌డం..యెడ్డీకి స్పీక‌ర్‌పై ఉన్న ప్ర‌తికార‌ భావానికి నిద‌ర్శ‌న‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: