సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు మారుపేరుగా నిలుస్తున్న‌ కర్ణాటక స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌కుమార్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్పీకర్‌ స్వతంత్ర ఎమ్మెల్యే సహా ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పీకర్ వేటు వేసిన‌ 14 మందిలో 11 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుండగా..ముగ్గురు జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్‌ నిర్ణయంతో ఇప్పటివరకు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరింది.  రెబెల్‌ ఎమ్మెల్యేలను రేపటి నుంచి శాసనసభకు అనుమతించబోమని రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.  2023 ఎన్నికల వరకు వీరు పోటీ చేసే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు.


కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మిగతా అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. తాజాగా అన్నంత ప‌ని చేశారు స్పీక‌ర్‌. కాగా,  స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసిన నేప‌థ్యంలో బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్ కూటములు మ్యాజిక్ ఫిగర్‌పై సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల వివరాలు:
* కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు: 
బస్వరాజు, మునిరత్న, ఎస్‌టీ సోమశేఖర్‌, రోషన్‌ బెగ్‌, ఆనంద్‌ సింగ్‌, ఎంటీబీ 
నాగరాజ్‌, బీసీ పాటిల్‌, ప్రతాప్‌ గౌడ, డాక్టర్‌ సుధాకర్‌, శివరాం హెబ్బర్‌, 
శ్రీమంత్‌ పాటిల్‌, రమేశ్‌ జర్కిహోళి, మహేశ్‌ కుమతల్లి 
* జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలు: 
గోపయ్య, 
నారాయణ గౌడ, 
ఏహెచ్‌ విశ్వనాథ్‌ 
* స్వతంత్ర ఎమ్మెల్యే: 
ఆర్‌ శంకర్‌


ఇదిలాఉండ‌గా, స్పీక‌ర్‌ను బీజేపీ టార్గెట్ చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని సులభంగా పడగొట్టి గద్దెనెక్కుదామని బీజేపీ భావించింది. కానీ.. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా  స్పీకర్ రమేశ్‌కుమార్ కాషాయ పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యెడియూరప్ప దృష్టి మంత్రివర్గ కూర్పు కన్నా.. స్పీకర్ రమేశ్‌కుమార్ పైనే ఎక్కువగా ఉందని అంటున్నారు. గత అనుభవాలకు ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రమేశ్‌కుమార్‌ను గద్దె దింపాల్సిందేనని సీఎం భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు అంటున్నాయి. మా దృష్టి మొత్తం సోమవారం జరుగనున్న బలపరీక్ష మీదే ఉన్నది. ఆలోగా స్పీకర్ స్వచ్ఛందంగా తప్పుకుంటారేమో చూద్దాం. లేకుంటే మేం బలపరీక్షలో నెగ్గిన తర్వాత.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నాం అని ఓ బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: