అది జయశంకర్‌ జిల్లాలోని మారు మూల అటవీ ప్రాంతంలోని తండా.
ఒక ఉదయం ఇప్పచెట్ల నుండి వీస్తున్న గాలితో పాటు, ఒక సైకిల్‌ వచ్చి గిరిజన కుటుంబం జీవిస్తున్న పూరింటి ముందు ఆగింది.
పీలగా సన్నగా ఉన్న వ్యక్తి సైకిల్‌ దిగి వచ్చి, ఆ ఇంట్లో వారిని పలకరిస్తూ, మట్టి అరుగు మీద కూర్చున్నాడు.
ప్రభుత్వం పథకాలు అందుతున్నాయా...? ఉపాధి హామీ పనులు దొరకుతున్నాయా...? పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారా..?
అని అప్యాయంగా వారి కష్టసుఖాలు తెలుసుకున్నాడు.


ఆయన ఆ జిల్లాకు పాలనాధికారి. పేరు ఆకునూరి మురళి. ఇలా జనం గుండె చప్పుడు వినే కలెక్టర్‌ని ఎక్కడైనా చూశారా...?
నిత్యం ప్రజల్లో మమేకం అయి, వారి సమస్యలు పరిష్కరిస్తున్న తీరు ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అలాంటి జనహితుడైన మురళికి బహుమతిగా, పని లేని పురావస్తు శాఖకు బదిలీ చేశారు. ఏడాది నుండి అక్కడ పనిలేకుండా కూర్చోపెట్టారు.

'' ఇక నేను పని లేకుండా ఊరికే ఉండలేను. చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా..'' అంటూ తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మురళి. నిరంతరం సామాజిక మార్పు కోసం తపించే, ఈ ఉన్నతాధికారికి ఏ.ఆర్‌. శంకరన్‌ అంటే అభిమానం. తన లాంటి నిబద్ధత కలిగిన అధికారులను అవమానించినందుకు నిరసనగా, ప్రభుత్వంపై వీఆర్‌ ఎస్‌ అస్త్రాన్ని సంధించారు.
ఇక నేను ఈ కొలువు చేయలేనంటూ ప్రకటించారు. ఈ విషయం తెలంగాణలో టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌, తెలంగాణ రాష్ట్ర ఆర్కివ్స్‌ శాఖ డీజీ ఆకునూరి మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే , జులై 27న, స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఐఏఎస్‌ మురళి గతంలో 2016లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పాలనలో వైవిధ్యం చూపించి, ప్రశంసలు అందుకున్నారు. కలెక్టర్‌గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. కలెక్టర్‌ అయినప్పటికీ చాలా నిరాడంబరంగా ఉండేవారు. కార్యాలయంలో కంటే ఎక్కువగా ప్రజల మధ్యే ఉండటానికి ఆసక్తి కనబరిచారు. తన కూతురికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

'' ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న దాంట్లో కనీసం 20 శాతం ఖర్చు చేయగలిగితే విద్యా వ్యవస్థ గాడిన పడుతుంది...'' అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనంతా, మొత్తంగా, భ్రష్టు పట్టి పోయిన విద్యా రంగం గురించే. మురళి కొంత కాలంగా ఈ ప్రభుత్వ పనితీరుపై, పాలనా వ్యవహారాలపై అసంతప్తితో ఉన్నారు. ఆయన కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రజలతో కలిసి పోయేందుకు ప్రయత్నం చేశారు. ఆయన గతంలో సెర్ప్‌ లో పనిచేసినపుడు కోటి మందికి ఉపాధి కలిపించారు.

ఈ దేశంలో ఎందరో నిబద్ధత కలిగిన ఐఏఎస్‌ అధికారులు సమాజ హితంలో భాగం ఉన్నారు. నిర్దేశించిన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వారిలో ఒక్కరుగా మారారు మురళి. విద్యా రంగాన్ని బాగు చేయడమే తన ముందున్న లక్ష్యమని అంటున్నారు. విద్య వ్యాపారంగా మారిన చోట విలువలకు చోటుండదు. ప్రజలను ప్రేమించిన వారు ఎందరో ఇలాంటి కష్టాలే అనుభవించారు.
ఏది ఏమైనా మురళి నిర్ణయం పలు చర్చలకు నాంది పలికింది. రేపు ఆయన బాటలో ఇంకెందరు ఉన్నారనేది త్వరలోనే బయట పడుతుందని విశ్లేషకులంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: