పదవుల పంపకం విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారా ? ఇపుడిదే అంశం పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది.  వైసిపి అధికారంలోకి రాగానే చాలామంది నేతలు పదవులు ఆశించారు. ఎన్నికలకు ముందే అసెంబ్లీ టికెట్లు ఎవరికి అనే విషయంలో  స్పష్టత వచ్చేయటంతో  టికెట్ల కోసం నేతలు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అందుకనే టికెట్లు మొత్తం ఒకేసారి ప్రకటించినా ఎక్కడా చిన్న అసంతృప్తికి కూడా కనబడలేదు.

 

ఎప్పుడైతే పార్టీ బంపర్ మెజారిటితో  అధికారంలోకి వచ్చిందో ఎన్నికల్లో కష్టపడ్డ నేతల్లో పదవులపై ఆశలు పెరిగిపోయాయి.  మంత్రిపదవులు కూడా పూర్తిస్ధాయిలో భర్తీ చేసేశారు. కాబట్టి రెండున్నరేళ్ళు మంత్రిపదవులపై ఆశలు వదిలేసుకున్నారు ఎంఎల్ఏలు. మంత్రిపదవులు ఆశించిన చాలామంది ఎంఎల్ఏల్లో మాత్రం తీవ్ర నిరాస కనబడింది. అందుకనే వారిని బుజ్జగించటం మొదలుపెట్టారు.

 

అయితే ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. ఎన్నికల్లో కష్టపడ్డ నేతలకు ఇవ్వాల్సిన పదవులను కూడా జగన్ మంత్రులకు, ఎంఎల్ఏలకే కట్టబెడుతున్నారు. ఏపిఐఐసి ఛైర్మన్ గా రోజా, తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గిరిజన సలహామండలి ఉపముఖ్యమంత్రి, మంత్రి అయిన పాముల పుష్ప శ్రీ వాణికి ఇచ్చారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటిలకు ఛైర్మన్లుగా ఎంఎల్ఏలనే నియమించారు.

 

ఇక్కడే జగన్ తప్పు చేస్తున్నారా అని అనిపిస్తోంది. ఎంఎల్ఏలే ఒక పదవి. మళ్ళీ వాళ్ళకే ఏపిఐఐసి, తుడా, మార్కెట్ కమిటిల ఛైర్మన్ పదవులెందుకు అని నేతలు మండిపోతున్నారు. పుష్ప శ్రీ వాణికి గిరిజన సలహా మండలి ఛైర్మన్ పదవి ఇచ్చే బదులు మరో ఎస్టీ ఎంఎల్ఏ పీడిక రాజన్నదొరకు ఇచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మార్కెట్ కమిటిలకు ఛైర్మన్లు ఎంఎల్ఏలను నియమించేబదులు మరో 175 మంది నేతలకు ఇచ్చుండొచ్చు. ఇప్పటికైనా కార్పొరేషన్లకు మళ్ళీ ఎంఎల్ఏలను నియమించేబదులు సీనియర్ నేతలకు ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది.

 ======================

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: