కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా మొన్నటి ఎన్నికల్లో  రాజా గెలిచిన విషయం తెలిసిందే. దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వారసునిగా రాజా రాజకీయ అరంగేట్రంగా చేశారు. పోయిన ఎన్నికల్లో ఓడిపోయినా మొన్నటి ఎన్నికల్లో మాత్రం గెలిచారు.

 

జక్కంపూడి రామ్మోహన్ కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు మంచి సన్నిహిత సంబంధాలుండేవి. అదే విధంగా వాళ్ళ వారసులైన జగన్మోహన్ రెడ్డి-రాజ కూడా బాగా సన్నిహితులే. రాజాకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో నిజమైంది.


నిజానికి పోయిన ఎన్నికల్లో రామానుజయ అనే కాపు నేతను చంద్రబాబునాయుడు ఛైర్మన్ గా నియమించినా కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఆయన చేసిందేమీ లేదనే చెప్పాలి. అదే సమయంలో కార్పొరేషన్ ను గబ్బు  పట్టించారు. సదావర్తి భూములు కొనుగోలులో రామనుజయను ముందుపెట్టి చంద్రబాబు వెనకనుండి చక్రం తిప్పాలని అనుకున్నారు. అయితే వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అడ్డుకోవటంతో చంద్రబాబుతో పాటు రామానుజయ కూడా గబ్బుపట్టారు.

 

ఇక కాపుల్లో పేదలకు కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక సహాయం చేయటంలో కూడా చాలా వివాదాలు రేగిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే దేని మీదకూడా చంద్రబాబు స్పందించలేదు. దాంతో రామానుజయ చెలరేగిపోయారు.  చివరకు కార్పొరేషన్ పై కాపుల్లోనే వ్యతిరేకత పెరిగిపోయింది.

 

మొన్నటి ఎన్నికల్లో కాపుల్లో అత్యధికులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేయటానికి ఇది కూడా ఓ కారణమనే చెప్పాలి. ఇంతటి కీలకమైన కార్పొరేషన్ కు ఇపుడు రాజా నియమితులయ్యారు. కాబట్టి కాపుల సంక్షేమానికి ఛైర్మన్ గా రాజా ఏ మేరకు పనిచేస్తారో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: