చేసుకున్న వారికి చేసుకున్నంత‌!! అన్న‌ట్టుగా ఉంది ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ..  ఏపీలో పెద్ద ఎత్తున చేసిన ప్ర‌జా ఉద్య‌మాల‌ను ఏ మాత్రం ఖాత‌రు చేయ‌కుండా.. తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్‌.. తీవ్ర ప్ర‌జాగ్ర‌హానికి గురై.. నేటికీ.. కోలుకోలేని ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోనీ.. రాష్ట్రాన్ని విభ‌జించాల‌ని అనుకున్న‌ప్పుడు ఎలాంటి రాజ‌ధాని కూడా లేని, వ‌న‌రులు, ఆదాయం లేని రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డంతో కాంగ్రెస్‌కు అడ్ర‌స్ గ‌ల్లంత‌యింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకు కూడా నాయ‌కులు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 


రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ, తెలంగాణ‌లకు కాంగ్రెస్ అధిష్టానం చెరో అధ్య‌క్షుడిని నియ‌మించింది. ఏపీకి సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డిని నియ‌మించ‌గా, తెలంగాణ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని నియ‌మించారు. అయితే, ర‌ఘువీరా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత వ‌చ్చిన తొలి ఎన్నిక‌లోనే కాంగ్రెస్ డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఇక‌, మ‌ధ్య‌లో నంద్యాల ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ ముస్లిం అభ్య‌ర్థిని నిల‌బెట్టి కీలక నేత‌లు ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో పార్టీని గౌర‌వ ప్ర‌తిప‌క్షంగా కూర్చోబెడ‌తామ‌ని స్వ‌యం ప్ర‌క‌టిత ర‌ఘువీరా వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో కాంగ్రెస్‌పై ఆశ‌ల మోసులు పెంచాయి. 


అయితే అనంత‌ర కాలంలో ఆయ‌న పార్టీని పార్టీని ముందుకు తీసుకు వెళ్ల‌డం ఏమో కానీ.. ఉన్న‌వారిని కాపాడుకోలేక పోయారు. అదే స‌మ‌యంలో ఒక‌ప‌క్క‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌జ‌లే కాంగ్రెస్‌ను దేబిరిస్తే.. ఆ పార్టీ చేసుకున్న స్వ‌యంకృతాలు కొన్ని మ‌రింత‌గా ఏపీలో పార్టీకి దిక్కులేకుండా చేశాయి. ప్ర‌ధానంగా ఏ పార్టీకి వ్య‌తిరేకంగా టీడీపీ పుంజుకుందో.. ఏ పార్టీ వ్య‌తిరేక పునాదుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుందో ఆ పార్టీ టీడీపీతో జ‌త క‌ట్ట‌డం, తెలంగాణ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ నేరుగా చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డం వంటి ప‌రిణామాల‌ను సంప్ర‌దాయ కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోలేక పోయారు. 


ఈ ప‌రిణామం కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో కోట్ల వంటి సీనియ‌ర్ నాయ‌కులు చాలా మంది పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. పార్టీలో సీనియర్‌ నేతలు నాదెండ్ల మనోహర్‌, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, పసుపులేటి బాలరాజు వంటి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు.  ఒక ప‌క్క ఘ‌ర్ వాప‌సీ అంటూ.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారిని ఆహ్వానించేందుకు పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌డితే.. ఈయ‌న మాత్రం పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇలాంటి స‌మ‌యంలోనూ ర‌ఘువీరా చ‌ర్య‌లు తీసుకోలేక పోయారు. బ‌ల‌మైన గ‌ళంతో ప్ర‌జ‌ల‌కు ర‌ఘువీరా చేరువ కాలేక పోయారు. మాస్ నాయ‌కుడే అయినా.. రైతు కుటుంబం నుంచి వ‌చ్చినా.. ఆయ‌న పార్టీలోని నాయ‌కుల మ‌ధ్యే స‌ఖ్య‌త‌ను ఏర్పాటు చేయ‌లేక పోయారు. 


దీంతో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే నాయ‌కుల‌ను ఎంచుకోవాల్సి వ‌చ్చింది. దీంతో పార్టీ ఒక్క చోట అంటే ఒక్క విజ‌యం కాదుక‌దా.. గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్లు కూడా తెచ్చుకోలేక పోయింది. ఈ నేప‌థ్యంంలోనే ర‌ఘువీరా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఏర్ప‌డిన పీసీసీ చీఫ్‌ప‌ద‌వికి కొత్త‌వారిని నియ‌మించాల‌ని చూస్తున్నారు. అయితే,  ప్రస్తుతం సీనియర్‌ నేతలుగా తులసిరెడ్డి, కనుమూరి బాపిరాజు, చింతా మోహన్‌ వంటివారు మిగిలారు. రాష్ట్రంలో పార్టీ బతికే పరిస్థితి లేనందున వారూ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని సున్నా స్థాయి నుంచి కీలక స్థాయికి చేర్చగల ‘మాస్‌ లీడర్‌’ కోసం ఏఐసీసీ అన్వేషిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: