దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని  ఉన్నావ్ లైంగికదాడి కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెన్‌గర్‌తోపాటు మరో 9 మందిపై ఆ రాష్ట్ర పోలీసులు సోమవారం హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అత్యాచార బాధితురాలు తన బంధువులు, న్యాయవాదితో కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఆదివారం ఢీకొన్న సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద కారణమైన లారీ నంబర్ ప్లేట్‌కు నల్లరంగు పూయడం గమనించారు. ఈ ప్ర‌మాదం వెనుక అనుమానాలు ఉండ‌టంతో...అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. 


ఆదివారం జ‌రిగిన ప్ర‌మాదంలో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె న్యాయవాది మహేంద్ర సింగ్.. లక్నో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీ మహిళాకమిషన్ చైర్‌పర్సన్ స్వాతి సోమవారం వారిని పరామర్శించారు. బాధితురాలి కుటుంబంతోపాటు విపక్షాలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇది సోమవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఫతేపూర్‌కు చెందిన లారీ నంబర్ యూపీ 71 ఏటీ 8300గా గుర్తించారు.  లారీ అతివేగం, వర్షం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. సీబీఐ దర్యాప్తుపై బాధిత కుటుంబం ఫిర్యాదును సర్కార్‌కు నివేదించినట్లు చెప్పారు. దీన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తామని లక్నో జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ చెప్పారు.  ఇది తమ కుటుంబం అంతానికి జరిగిన కుట్ర అని, తమను చంపుతామని ఎమ్మెల్యే అనుచరులు ఇటీవల బెదిరించినట్లు బాధితురాలి తల్లి తెలిపారు. 


ఇదిలాఉండ‌గా, ఉన్నావ్ బాధితురాలి కేసుపై సుప్రీంకోర్టు స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. న్యాయం పక్కదారిపడుతోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్‌తివారీ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితులకు న్యాయం జరుగుతుందా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. భేటీ బచావో.. భేటీ పడావో. భారతీయ మహిళలకు ఓ కొత్త, ప్రత్యేక విద్యా బులిటెన్. బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడి చేసినా ఎలాంటి ప్రశ్నలు అడుగవద్దు అని రాహల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని దర్యాప్తు చేయించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. ఓ ప్రణాళిక ప్రకారం బాధితురాలి కుటుంబం హత్యకు కుట్ర అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: