జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చిచ్చు మొదలైంది. మనోహర్ కు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అపరిమితమైన ప్రాధాన్యత ఇవ్వటాన్ని చాలామంది నేతలు తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. పవన్ ఎక్కడి కెళ్ళినా  మనోహర్ కూడా వెంటే ఉంటున్నారు.  చివరకు మొన్న  తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్ళినపుడు కూడా  మనోహర్ పక్కనే ఉన్నారు.

 

ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న వ్యవహారాల ప్రకారం జనసేనలో నెంబర్ 2 పొజిషన్ నాదెండ్లదే అనే ప్రచారం బాగా జరుగుతోంది. దాంతో మనోహర్ పార్టీలో చేరకముందు నుండి కీలకంగా వ్యవహరించిన పవన్ కోటరీతో పాటు మరికొందరికి బాగా మండిపోతోంది. దాంతో నాదెండ్ల స్ధాయిపైనే కాకుండా ఆయనకిస్తున్న ప్రాధాన్యతపైన కూడా చర్చ జరుగుతోంది.

 

విషయం ఏమిటంటే మొన్నటి వరకూ జనసేనలో అధికార ప్రతినిధిగా పనిచేసిన అద్దేపల్లి శ్రీధర్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చను రోడ్డున పడేశారు. అంతర్గత చర్చపై శ్రీధర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో పార్టీలో గొడవలు ఒక్కసారిగా బయటపడి చర్చకు దారితీశాయి.

 

జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, భరత్ భూషణ్, శేఖర్ పులి లాంటి అనేకమంది నేతలను పక్కనపెట్టేసి కేవలం నాదెండ్లను మాత్రమే పవన్ ప్రమోట్ చేస్తుండటంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణా గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తో పాటు చిరంజీవిని కలిసినపుడు పక్కనే నాదెండ్ల ఉన్న ఫొటోలను కూడా అద్దేపల్లి ట్యాగ్ చేశారు.

 

పవన్ విపరీతంగా ప్రాధాన్యత ఇస్తున్న నాదెండ్ల చివరకు తన తండ్రి నాదెండ్ల భాస్కరరావును కూడా ప్రభావితం చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. భాస్కరరావును బిజెపిలో చేరకుండా మనోహర్ ఎందుకు ఆపలేకపోయారంటూ నిలదీశారు. నిజానికి తండ్రి, కొడుకులిద్దరూ మాట్లాడుకునే ప్లాన్ ప్రకారమే చెరో పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది లేండి. మొత్తం మీద జనసేనలో నాదెండ్ల చిచ్చు మొదలైందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: