ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులూ పరిశ్రమలు పెట్టుబడులు అంటూ లెక్చర్లు దంచేవారు. ప్రతి ఏటా దావోస్ వంటి నగరాల్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులకు వెళ్లేవారు. ఆయన వెంట మంత్రులు, అధికారుల బృందం వెళ్లేది. వీరి ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, అక్కడి సదస్సుల్లో పాల్గొనేందుకు ఫీజులు.. కన్సల్టెంట్ల సేవలు..ఇలా రాష్ట్ర ఖజానాకు ఖర్చు తడిసి మోపెడయ్యేది.


అయితే ఇలాంటి ఖర్చును వృథా ఖర్చుగా చూడకూడదంటారు ఆర్థిక వేత్తలు.. వీటి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే.. పరిశ్రమలు వస్తే.. ఈ ఖర్చు వృథా కిందకు రాదు. కానీ చంద్రబాబు విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఖర్చు తప్ప ఒరిగిందేమీ లేదని వైసీపీ అగ్రనేతలు వాదిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు దావోస్‌లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.


నాలుగు 4 రోజుల భోజనాలకు రూ. 1.05 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేల్చాలంటున్నారు విజయ సాయిరెడ్డి. ‘రోమ్ తగలడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని మరపించారు చంద్రబాబు అంటూ ట్వీట్ సంధించారు. నీటి కొరత, రోగాలు, కరువు, తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగలేశారని మండిపడ్డారు. చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఒరిగింది శూన్యం. ఒక్క పరిశ్రమ రాలేదని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌ లో తెలిపారు.


అయితే చంద్రబాబు కేవలం దావోస్ పర్యటనలకు మాత్రమే వెళ్లలేదు.. పెట్టుబడుల వేట అంటూ చైనా, మలేసియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలకు కూడా వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక విమానాలు వాడారు. అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరి వాటి ఖర్చు కూడా లెక్కలు తీస్తారా.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: