సుజనా చౌదరి, పురంధేశ్వరి , ఇద్దరు మాజీ మంత్రులే ఇద్దరి పార్టీలు వేరు కానీ, ఇప్పుడు ఇద్దరూ కాషాయ కండువాలే ధరించారు. ఇద్దరి మధ్యా క్యాబినెట్ రేస్ మొదలై, తమదైన శైలిలో పావులు కదపడం మొదలుపెట్టేశారు. వారిద్దరిలో కేంద్ర మంత్రి అయ్యేదెవరు అని ఎపి, బిజెపిలో ఇప్పుడు  ఆసక్తికరమైన వార్ ఎపిసోడ్ మొదలైయ్యిందట. ఒకవైపు పురంధేశ్వరి ,మరోవైపు సుజనా చౌదరి ఇద్దరూ తమకు పార్టీ అప్పగించిన పనులను సీరియస్ గా చేసుకుపోవడమే కాకుండా మరో ముఖ్యమైన పని కూడా ప్రారంభించారు.


విషయానికి వస్తే  ఏపీలో పార్టీని బలోపేతం చేయడం పై బిజెపి అధిష్టానం బాగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తమకు ఒక్క లోక్ సభ సభ్యుడు కూడా లేడని భావించిన మోదీ అండ్ కో,  ఒక కేంద్ర మంత్రి పదవి ఏపీకి ఇవ్వాలని  డిసైడ్ అయ్యారట. ఈ బ్యాగ్రౌండ్ లో ఆపరేషన్ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అనే పేరిట సుజనా మరియు పురంధేశ్వరి పోటీపడుతున్నారని సమాచారం.వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులుగా పని చేశారు. అయితే సుజనా చౌదరి ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడుగా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రి కావాలన్న లక్ష్యం చేరుకోవడానికి ఆయన ఒక మెట్లెక్కితే చాలు.


కానీ పురంధేశ్వరి కేంద్ర మంత్రి అవ్వాలంటే ముందు రాజ్య సభ సభ్యురాలు కావాలి, ఈ కోణంలో తనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సుజనా భావిస్తున్నారట. అదే సమయంలో టిడిపి లోని నేతలందరితో సుజనాకి మంచి సంబంధాలే ఉన్నాయి. రాబోయే రోజుల్లో టిడిపి నుంచి భారీగా వలసలు జరిగేలా చూడాలంటే తనకు మంచి పదవి ఉంటే బావుంటుందని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళారంట సుజనా చౌదరి. ఇలా పార్టీ బలోపేతానికి తన మంత్రి పదవికి ముడిపెట్టి రేసులో  ముందున్నాననే ధీమాతో సుజనా ఉన్నారట.


పురంధేశ్వరి రెండు వేల పద్నాలుగులో బిజెపిలో చేరారు. రెండు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో పని చేసుకుంటూ పోతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన వేళ జాతీయ స్థాయిలో అందరి గుర్తింపు పొందారు, ఇప్పుడు ఏపిలో టిడిపిని నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్నది బిజెపి ప్రస్తుత వ్యూహం. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సరైన గౌరవం ఇస్తే టిడిపిని సంక్షోభంలోకి నెట్టామన్న ప్రతికూలతను  తగ్గించుకోవచ్చు అన్న వాదనను కొందరు బిజెపి నేతలు వినిపిస్తున్నారట.


మరోవైపు అసలు పురందేశ్వరిని రాజ్య సభకు పంపాలని రెండు వేల పధ్ధెనిమిదిలో మోదీ భావించారట. ఈసారి ఖచ్చితంగా పురంధేశ్వరికి రాజ్య సభ సీటు ఇవ్వాలని బిజెపి హైకమాండ్ భావిస్తోందట. ఈ క్రమంలో ఇక కేంద్రమంత్రి పదవి అన్నది పెద్ద కష్టం కాకపోవచ్చని ఆమె వర్గం చెబుతోంది. ఇలా అటు సుజనా ఇటు పురంధేశ్వరి తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో  బీజేపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తికరంగా వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: