అసెంబ్లీలో దూకుడుగా ఉన్న అధికార పార్టీ శాసన మండలి విషయానికి వచ్చే సరికి మాత్రం దూకుడు చూపించలేక పోతోంది. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్దపార్టీగా వైసీపీ అవతరించిన విషయం తెలిసిందే. దీంతోటీడీపీ 23 మందికే పరిమితమవగా జనసేన ఒకే ఒక్క సీటును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జగన్‌కు ఆయన పరివారానికి మాత్రం అసెంబ్లీలో ఎక్కువ సమయం దక్కడంతోపాటు.. టీడీపీని తీవ్రస్థాయిలో ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా అవకాశం చిక్కుతోంది. అందుకే అసెంబ్లీలో రోజుకో వివాదం తారస్థాయికి చేరుతోంది. అసెంబ్లీలో జగన్‌ దూకుడును టీడీపీ తట్టుకోలేక పోతున్న విషయం కూడా తెలిసిందే. 


అయితే, దీనికి భిన్నంగా శాసన మండలిలో మాత్రం అంతా టీడీపీది కాస్త డామినేష‌న్‌గా క‌న‌ప‌డుతోంది. తాజాగా ప్రభుత్వం ఎనిమిది బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టింది. దీనిలో బీసీలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు, మహిళలకు అన్ని రంగాల్లోనూ 50 శాతం కోటా అమలు, దశల వారీగా మద్య నిషేధం వంటివి ఉన్నాయి. వీటిని అసెంబ్లీలో తేలికగానే ఆమోదం పొందిన సర్కారు మండలి విషయానికి వచ్చే సరికి వాడి వేడి చర్చలు, పరస్పర వ్యక్తిగత దూషణల వరకు విషయం వెళ్లింది.  


ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీదే పైచేయిగా నిలిచింది. మరోపక్క, అసెంబ్లీలో జగన్‌కు కేవలం ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ మాత్రమే ఉంటే.. మండలిలో బీజేపీకూడా తోడైంది. దీంతో జగన్‌ పరివారానికి ఇబ్బందిగా ఉందని తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్‌, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌రావు వంటి కీలక దిగ్గజాలు మండలిలో టీడీపీకి అండగా నిలిచారు. అందుకే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన వస్తున్నా.. సుదీర్ఘ చర్చలతో జగన్‌ అండ్‌ టీంను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమని అంటున్నారు పరిశీలకులు. 


ఇక, బీసీలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుపై అసెంబ్లీలో కంటే కూడా మండలిలోనే టీడీపీ బలమైన వాదన వినిపించింది. ఎన్టీయార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు మేలు జరిగిందని, ఇలాంటి బిల్లుతో ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదని, మీకు బీసీలపై అంత ప్రేమ ఉంటే.. వెంటనే బీసీ అట్రాసిటీ యాక్ట్‌ తీసుకురావాలని వీరంతా ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఇలాంటి పరిణామాలు మండలిలో రోజూ జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: