ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఓ స‌వ‌ర‌ణ‌ల బిల్లుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆమోద ముద్ర వేయించుకోగ‌లిగారు. ప్రతిప‌క్షాల అనైక్య‌త‌, వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌తో త‌న పంతం నెగ్గించుకున్నారు. మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతిని క్రిమినల్‌ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కు మంగళవారం రాజ్యసభ అంగీకారం తెలిపింది. బీజేడీ మద్దతుగా నిలువడం, మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకే వాకౌట్‌ చేయడం, పలువురు విపక్ష సభ్యుల గైర్హాజరు నేపథ్యంలో ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న పెద్దల సభలో అధికార బీజేపీ సునాయాసంగా గట్టెక్కింది. 


గతవారమే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, తాజాగా రాజ్యసభ కూడా అంగీకారం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 88 ఓట్లు వచ్చాయి.  ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ తిరస్కరించింది. విపక్షాల తీర్మానానికి అనుకూలంగా 84, వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో అధికార ఎన్డీయేకు తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ విపక్ష కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీకి చెందిన పలువురు సభ్యులతోపాటు టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు, వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యుల గైర్హాజరు కలిసొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆమోదముద్ర వేసిన అనంతరం బిల్లు చట్టరూపం దాల్చనుంది. 


త‌లాక్ ర‌ద్దు బిల్లు ఆమోదం విష‌యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.రాజ్యసభలో మొత్తం 242 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏకు 107 మంది సభ్యుల బలముంది. సాధారణంగా బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీ మార్క్‌ 122 కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీయూ(ఆరుగురు ఎంపీలు), అన్నాడీఎంకే (11 మంది) సభ్యులు వాకౌట్‌ చేయడంతో మెజార్టీ మార్క్‌ తగ్గింది. ఇది బీజేపీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చింది. వివాదాస్పద ఆర్టీఐ సవరణ బిల్లు ఆమోదానికి కూడా గత వారం బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. మరోవైపు, ఓటింగ్‌ సమయంలో సుమారు 20 మంది విపక్ష సభ్యులు గైర్హాజరు కావడం కూడా అధికార పక్షానికి కలిసొచ్చింది. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఐదుగురు చొప్పున గైర్హాజరయ్యారు. ఎన్సీపీకి చెందిన శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌ కూడా సభకు హాజరుకాలేదు. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున గైర్హాజరయ్యారు. అలాగే బిల్లును వ్యతిరేకిస్తున్న నామినేటెడ్‌ సభ్యుడు కేటీఎస్‌ తులసి కూడా సభకు హాజరుకాలేదు. ఒకవేళ విపక్ష సభ్యులందరూ హాజరై ఉంటే బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపే తీర్మానం ఆమోదం పొంది ఉండేది. కాగా, బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలకు జరిగిన ‘చారిత్రక అన్యాయాన్ని’ సరిచేశామని, ఇక ఈ ప్రాచీన, మధ్యయుగ ఆచారం చారిత్రక చెత్తబుట్టకే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: