భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎప్పుడైతే ఓ మహిళ ఒంటరిగా అర్థరాత్రి ఎప్పుడు బయట స్వేచ్చగా నడుస్తుందో అదే నిజమైన స్వాతంత్రం అని అన్నారు.  అయితే ఈ మద్య కాలంలో రాత్రి పూట సంగతి దేవుడెరుగు మిట్ట మధ్యాహ్నం మహిళలు బయట ఒంటరిగా తిరాగాలంటేనే గుండెలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.  ఎక్కడ చూసినా మహిళలపై అంతెందుకు చిన్నారులపై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు.  

ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు అనే వార్తలే వస్తున్నాయి.  విచక్షణ కోల్పోయి, కామంతో కళ్లు మూసుకు పోయి కొంత మంది దుర్మార్గులు చేస్తున్న అఘాయిత్యాలకు ఎంతో మంది మహిళలు బలి అవుతున్నారు.  అయితే పోలీసు ఎంత రక్షణ కల్పించినా ఇలాంటి కీచకుల నుంచి కాపాడలేక పోతున్నారు. అయితే మహిళలు ఒంటరిగా ఎక్కడికి పోవొద్దు అంటూ ఆంక్షలు పెట్టే వారికి ఏపి డీజీపీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

రాత్రి వేళల్లో టీ తాగడానికి మహిళలు బయటకి ఎందుకు వెళ్లకూడదని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణపై శిక్షణ (క్లాప్) కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాత్రి సమయంలో కూడా మహిళలు బయటకి రావాలని పిలుపునిచ్చారు. ఏపీ డీజీపీ ప్రజలు, పోలీసులు కలిస్తే ఆ ప్రభావం సమాజంలో వేరుగా ఉంటుందన్నారు.

పుట్టక ముందు నుంచే స్త్రీ అంటే ఆలోచన వేరుగా ఉందన్నారు. సమాజంలో లింగ వివక్షత ఉండకూడదని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మహిళా మిత్ర ద్వారా సమాజంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. గతంలో పోలీస్ అంటే అనేక అనుమానాలు, స్టేషన్‌కు వెళ్లలేము అనే భావన ఉండేదని.. ఇప్పుడు అదంతా మారిపోయిందన్నారు.

మార్పు ఓవర్ నైట్‌లో రాదని.. సిస్టమేటిక్‌గా తీసుకురావాలన్నారు. సమాజం మారాలి అనుకుంటే సరిపోదని.. మనం మారాలి అనే ఆలోచన శాశ్వతంగా ఉండాలన్నారు. స్పందన కార్యక్రమంపై ప్రతి మంగళవారం సీఎం జగన్ రివ్యూ నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నట్టు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: