పసుపు-రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఇది ప్రధాన వంట దినుసు. అంతేకాదు, మంగళ ప్రదం కూడా. అంతేనా.. మంగళ కార్యాలయాలకు ఇదే ప్రధాన వస్తువు. అలాంటి పసుపు ఇప్పుడు బీజేపీకి కారంగా మారిపోయింది. కమలానికి అంటుకున్న పసుపు పోనంటే పోనని భీష్మించింది. దీంతో కమలం పార్టీ నాయకులు కుమిలిపోతున్నారు. ఏం చేసి ఈ పసుపు మరకను తొలగించుకోవాలి? ఎలా పసుపు రంగును కడిగేసుకోవాలి? అని బీజేపీ నాయకులు మథన పడుతున్నారు. 


మరి అంతగా ఈ పసుపు కమలాన్ని కుమిలేలా ఎందుకు చేసినట్టు? మంగళ ప్రదమైన పసుపు తమకు అంటుకుందని బీజేపీ నేతలు ఎందుకు బాధపడుతు న్నారు? ఇప్పుడు ఈ టాపిక్కే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. విషయంలోకివెళ్తే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని పట్టాలెక్కించేందుకు ఆ పార్టీ నాయకులు చేయని జిమ్మిక్కులు, ఇవ్వని హామీలు లేవు. ఈ క్రమంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ కాంగ్రెస్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి అరవింద్‌ పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌ టికెట్‌ను దక్కించుకున్నారు. 


ఇక్కడ నుంచి 2014లో కేసీఆర్‌ తనయ కవిత పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమెను ఓడించి రికార్డు సాధించాలని నిర్ణయించుకున్న అరవింద్‌ ఇక్కడి రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. పోనీ.. అక్కడితో ఆయన ఊరుకుంటే సరిపోయేది. కానీ, తగుదునమ్మా అంటూ.. రూ.100 స్టాంపు పేపర్‌పై ఈ హామీని నెరవేరుస్తానని, నెరవేర్చక పోతే.. తాను రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్య రాసి సంతకం పెట్టారు. 


దీంతో కవితను ఓడించిన ఇక్కడి ప్రజల అరవింద్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఆయన ముందున్న ప్రధాన హామీ.. పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే. అయితే, పసుపు బోర్డు ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రబుత్వ పరిధిలోని అంశంకాదు. అంతేకాదు, కేంద్రంలోని ప్రభుత్వం దీనికి సంబంధించి పార్లమెంటులో తీర్మానం చేసి ఏర్పాటు చేయాలి. అయితే, ఈ బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏదీ తమకు రాలేదని, తమకు కూడా బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్ధేశం ఏదీ లేదని ఇటీవల కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది. 


దీంతో ఇప్పుడు నిజామాబాద్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడం, అధికార పక్షం.. బీజేపీపై విమర్శలు చేయడంతో ఇప్పుడు బీజేపీ నాయకులు ఈ పసుపు బోర్డు హామీ ఏంట్రా బాబూ అంటూ.. తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి అరవింద్‌ ఇచ్చిన హామీ కమల నాథులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: