వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచే ఇద్ద‌రు ప్ర‌ముఖ సినీన‌టుల మ‌ధ్య ఊహించని రీతిలో ప‌ర‌స్ప‌ర మాట‌ల యుద్ధం సాగుతోంది. సినీన‌టుడు, వైసీపీ నేత పృద్వీ ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ, జగన్ సీఎం అవటం సినీ పెద్దలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వివిధ పెద్ద ఎత్తున్నే చ‌ర్చ జ‌రిగింది. కానీ ఎవ‌రూ బ‌హిరంగంగా స్పందించ‌లేదు. అయితే, తాజాగా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ మురళి ఈ కామెంట్ల‌పై రియాక్ట‌య్యారు. నటుడు పృద్వీ వ్యాఖ్యలను ఆయ‌న ఖండించారు.


టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు గెలవాలని సినీ పెద్దలు సహజంగానే కోరుకుంటారని పోసాని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జగన్ సీఎం అవటం సినీ పెద్దలకు ఇష్టం లేదనటం‌ సరైంది కాదని పోసాని అన్నారు. పృద్వీ తొందరపడి మాట్లాడారని అనుకుంటున్నానని పేర్కొన్నారు. దగ్గుబాటి సురేష్‌బాబు గతంలో‌ సీఎం సమయం అడిగారని, అయితే...అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి సమయం ఇస్తారని చెప్పార‌ని  వెల్ల‌డించారు. సీఎం జగన్ నచ్చాల్సింది ప్రజలకే కానీ లోకేష్, పవన్ కళ్యాణ్‌కు కాద‌ని పోసాని అన్నారు. అస‌లు అలా నచ్చాల్సిన అవసరం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కూడా జగన్‌ను వ్యతిరేకించారని ఆయ‌న అన్నారు.


ట్విట్టర్లో లోకేష్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని పోసాని అన్నారు. 24గంటలు ఖాళీగా ఉన్నాడు కాబట్టి..లోకేష్ ట్విట్టర్‌లో బిజీగా ఉన్నాడని ఆయ‌న ఎద్దేవా చేశారు. చంద్రబాబు నివాసం అక్రమ అని తెలిపినా లోకేష్‌కు కోపం వస్తోందని ఆయ‌న చెప్పారు. సినీన‌టుడు శివాజీ కామెంట్ల‌ను తాను పరిశీలించలేదని పోసాని అన్నారు. తాను వైసీపీలో ఉన్నాను.. శివాజీ ఏ పార్టీయో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబును శివాజీ ఏమన్నాడో.. ఇప్పుడు ఏమంటున్నాడో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. శివాజీ అంత పెద్ద హీరోను కామెంట్ చేసే స్థాయి నాది కాదని వ్యంగ్యంగా అన్నారు. పోలవరం కాంట్రాక్టర్‌ విషయంలో సీఎం జ‌గ‌న్‌ చొరవను అభినందిస్తున్నానని పోసాని పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి మినహా 1983 నుంచి పనిచేసిన అందరి సీఎంల కంటే జగన్ బాగా పనిచేస్తున్నారని తెలిపారు. 2012 ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ గారి తరుపున ప్రచారం చేశానని గుర్తుచేశారు. అప్పట్లో రోజా, తాను తప్ప సినీ పరిశ్రమ నుంచి ఎవరూ లేరని అన్నారు. వైసీపీకి ఎంత చేయాలో.. అంత చేశాను.. పదవి ఇస్తే కాదననని, అయితే...కానీ పదవి కోసం ఎగబడనని పోసాని చెప్పారు. త‌నకంటే ఎక్కువ కష్టపడ్డారు కాబట్టే జూనియర్ల‌కు పదవులు వచ్చాయని పోసాని వివ‌రించారు. ఎక్కువ కష్టపడిన వారికి పదవులు సహజమ‌న్నారు. 


ఈ సంద‌ర్భంగా తన ఆరోగ్యంపై వస్తోన్న అపోహలను పోసాని ఖండించారు. మే 13న అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చేరానని వివ‌రించారు. గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్ల‌డించారు. ``ఒక సందర్భంలో చనిపోతానేమో అనేంత భయపడ్డాను. విషమ పరిస్థితుల్లో పోసాని, వికటించిన పోసాని ఆరోగ్యం.. అని సోషల్ మీడియా ప్రచారం చేయటం బాధించింది. సోషల్ మీడియా వల్ల వేషం ఇచ్చేవాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. రెండు ఆపరేషన్ల తర్వాత నా ఆరోగ్యం చాలా బాగుంది. నా ఆరోగ్యం మెరుగవటానికి కారణమైన డాక్టర్ ఎంవీ.రావుకు ధన్యవాదాలు`` అని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: