అధికారంలోకి రానంతవరకూ బాగానే ఉంటారు. తీరా పవర్ సంపాదించాకా పంచుకోవడానికి తగవులు ఆడుకుంటారు. ఎక్కడ లేని ద్వేషాలు, వర్గ విభేదాలు వచ్చేస్తాయి. దాంతో మునుపటి ఐక్యత దెబ్బతిని జనంలోనూ పరువు పోగోట్టుకుంటారు. ఇదంతా చూసిన ప్రజానీకం వీలెందిరా భాయ్ అనేసారంటే పరువూ గోవిందా, పదవీ గోవిందా.. ఇపుడు అక్కడ అదే కధ సాగుతోంది.


విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు, ఎలాగంటే రాజకీయ ఘనాపాఠి, ఘనమైన వంశ చరిత్ర కలిగిన పూసపాటి అశోక్  గజపతి రాజు చేయలేని పనిని తాను చేసి చూపించాలనుకుంటున్నారు. అవకాశాలన్నీ మలిగిన వేళ అశోక్ తన కూతురు అతిధి గజపతి రాజుని రాజకీయాల్లోకి తెచ్చి అభాసుపాలు  అయ్యారు. తనతో పాటు కుమార్తె కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోవడానికి కారకులయ్యారు. ఆ తప్పు కోలగట్ల చేయరట. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు. ఇక రాజకీయాల్లో వారసత్వం పెద్ద జబ్బు.  అయినా ఏ నాయకుడూ కడుపు తీపిని చంపుకోలేరు. అందుకోసం ఎంతవరకైనా వెళ్తారు. దీనికి  ఎవరూ అతీతులూ కారు. 


విజయనగరం కార్పొరేషన్ గా అవతరించాక త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మేయర్ పదవికి తన కుమార్తె శ్రావణికి బరిలో నిలబెట్టాలని కోలగట్ల పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో తన పని తాను చేసుకుపోతున్నారు. జగన్ వద్ద కోలగట్లకు మంచి పేరు ఉండడం కూడా కలసివస్తోంది. ఎటూ మంత్రి పదవి జగన్ ఇవ్వలేదు. దాంతో మేయర్ సీటు కూతురుకి అడిగి ఆ ముచ్చట తీర్చుకుందామని కోలగట్ల ఆలోచిస్తున్నారుట. ఇక పార్టీ బలంగా ఉంది. దానితో పాటే కోలగట్ల కూడా విజయనగరం పట్టణంలో గట్టి నేతగా ఉన్నారు. 1989 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయన ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. రెండు మార్లు కూడా పూసపాటి కుటుంబం మీదనే నెగ్గడం విశేషం. దాంతో తనకు ఉన్న బలాన్ని చూపించి విజయనగరం కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగరేయాలని తాపత్రయపడుతున్నారు.


ఇక కోలగట్లకు సొంత పార్టీలోనే వైరి వర్గం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలతో ఆయన అనుచరులు కోలగట్లను దిగలాగాలని చేయని ప్రయత్నం లేదు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా కోలగట్లను ఓడించాలని ఎంతగానే ప్రయత్నాలు చేశారు.  అయితే కోలగట్ల తనదైన ఎత్తుగడలతో విజయం సాధించారు. ఇపుడు అదే తీరుగా కార్పొరేషన్ కొల్లగొట్టాలని కోలగట్ల పట్టుదలగా ఉన్నారు. ఎమ్మెల్యే కావడమే ఆలస్యం ఆయన నగరంలో పార్టీని పటిష్టం చేయడంపైనే ద్రుష్టి సారించారు. ఇక కుమార్తె శ్రావణి కూడా విద్యాధికురాలు, తండ్రి గెలుపు వెనక ఎంతగానే క్రుషి చేసింది. దాంతో ఇపుడు ఆమెని ముందుంచి కోలగట్ల పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్క దెబ్బకు పార్టీలోని ప్రత్యర్ధులతో పాటు అంతా చిత్తు కావాలన్నదే కోలగట్ల టార్గెట్ గా ఉంది.. ఈ వర్గపోరులో విజయనగరం మేయర్ సీటుని వైసీపీ గెలుస్తుందా అన్నది పెద్ద డౌట్ గా  ఉంది.  చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: