కేటీఆర్‌...టీఆర్ఎస్ పార్టీ  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అనే సంగ‌తి తెలిసిందే. ఈ హోదాలో ఉన్న వ్య‌క్తికి సాధార‌ణంగా కీల‌క నిర్ణ‌యాల‌న్నీ తెలుస్తాయి. అయితే తాజాగా కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జోరుగా వినిపిస్తున్న కేబినెట్ విస్తరణ గురించి ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేబినెట్‌ తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పార్టీ విషయాల గురించి నన్ను అడగండి..! కానీ, కేబినెట్ గురించి తనను అడగొద్దన్నారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసిశానన్న కేటీఆర్...గవర్నర్‌తో భేటీకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. 


మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.  రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. విపక్షాలకు స‌మ‌స్య‌లేవీ లేవన్నారు. ``ఎలాంటి ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ప్రతిపక్షాలకు అర్థమైంది.  ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతిపక్షాలకు సమస్యలు లేవు. ప్రతిపక్షాలు ఎంత అరిచినా మేం పట్టించుకోం`` అని తెలిపారు.


టీఆర్ఎస్ సభ్యత్వం 50 లక్షలకు చేరుకున్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కింద రూ.11.21 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేసినట్టు తెలిపారు. 2014-15 నుంచి కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని వెల్లడించిన కేటీఆర్ కొత్తగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికీ బీమా కల్పిస్తామన్నారు. కార్యకర్తలకు ప్రమాద బీమా అందేలా ప్రీమియం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు ఇలా కమిటీల నిర్మాణం జరుగుతోందని... టీఆర్ఎస్‌ను నిర్మాణం కలిగిన పార్టీగా తయారు చేస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: