పదేళ్ల పోరాట ఫలితంగా ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. జగన్ సైతం తన కోసం గట్టిగా నిలబడిన వారిని గుర్తించి మరీ తగిన న్యాయం చేస్తున్నారు.  దీంతో పాటే రాజకీయాలకు అవసరమవుతారనుకున్న వారిని సైతం దగ్గర తీస్తున్నారు. దీంతో ఆ సామాజికవర్గంలో ఆశలు రెట్టింపు అవుతున్నాయి. విశాఖ జిల్లాకు మాత్రమే పరిమితమైన ఆ సామాజికవర్గానికి ఇపుడు అధికారంలో తగిన భాగస్వామ్యం లేదు. దాంతో ఆ వర్గం తమకు జగన్ గుర్తించి  అవకాశాలు ఇస్తారని గట్టిగా భావిస్తోంది. 


 ప్రధానమైన గవర సామాజికవర్గం విశాఖ జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. బీసీ కేటగిరీకి చెందిన ఈ వర్గాన్ని టీడీపీ హయాంలో కొంత మేర ఆదరించిన పరిస్థితులు ఉన్నాయి. పదేళ్ల క్రితం మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ కాంగ్రెస్ లో ఉండగా ఈ సామాజిక వర్గం ఓ వెలుగు వెలిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు దక్కలేదు. ప్రభుత్వ విప్ ఇచ్చి సంత్రుప్తి పరచారు. వైసీపీలో గవర నాయకులు ఉన్నారు కానీ తాజా ఎన్నికల్లో ఒకరికి టికెట్ దక్కలేదు. రెండవవారు ఓడిపోయారు. దాంతో నామినేటెడ్ పదవుల పైన గంపెడు  ఆశలు పెట్టుకున్నారు.


పార్టీలో ముందు నుంచి ఉన్న మళ్ళ విజయప్రసాద్ తనకు విశాఖ మేయర్ పదవి అయినా, లేకపోతే కీలకమైన రాష్ట్ర స్థాయి పదవి అయినా లభిస్తుందని ఆశపడుతున్నారు. మరో వైపు ఎన్నికల ముందు పార్టీలో చేరిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ తనకు కచ్చితంగా ఇస్తారని భావిస్తున్నారు. తన కుమారుడికి కూడా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఈ మేరకు జగన్ సైతం హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో ఈ సామాజికవర్గం ఓట్లు చాలా కీలకం. 


అనేక వార్డుల్లో గట్టి పట్టు ఉన్న ఈ సామాజివర్గానికి సముచితమైన స్థానం జగన్ కల్పిస్తారని భావిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి  సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ఇచ్చినందున గవరలకు కూడా అతి ప్రాముఖ్యత కలిగిన నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఎదురుచూస్తున్నారు. విశాఖ విషయంలో జగన్ సైతం ప్రత్యేక ద్రుష్టి పెట్టినందువల్ల నాయకులకు పదవుల కోరిక తీరిపోతుందని అంటున్నారు.  మరి జగన్ తొందరలోనే పదవుల పందేరం పూర్తి  చేస్తే తమ అద్రుష్తం పరీక్షించుకుందామని ఈ వర్గం ఆత్రుత పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: