తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుతం రెండోసారి కూడా సీఎం అయి.. రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రజానాయకుడు కేసీఆర్‌ అండ్‌ ఆయన పార్టీ టీఆర్‌ ఎస్‌కు ప్రమాదపు గంటలు మోగుతున్నాయా? వచ్చే రెండు మూడేళ్లలో కేసీఆర్‌కు ఇబ్బందులు ఏర్పడనున్నాయా? అంటే.. తాజాగా బీజేపీ నేతలు వేస్తున్న వ్యూహాలు ఔననే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగులేదు. ముఖ్యంగా ఆయన తన ప్రధాన శత్రువు కాంగ్రెస్‌ను నామ రూపాలు లేకుండా చేశారు. దాదాపు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని విలీన ప్రకటన కూడా చేయించేశారు. 


దీంతో అసెంబ్లీలో అతిపెద్దపార్టీగా దాదాపు ప్రతిపక్షమే అనేది లేకుండా చేసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజయం సాధించారు. ఇక, బీజేపీ తరఫున ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక్కరు మాత్రమే మిగిలారు. దీంతో కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఎలాంటి పాలన అందించినా కూడా అడిగే నాథుడు లేకుండా పోయారు. ఇలా జోరుమీదున్న కేసీఆర్‌కు చెప్పులో రాయి మాదిరిగా.. కంట్లో నలుసు మాదిరిగా కమలం పార్టీ మారిపోయింది. 


సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు ఎంపీలను గెలిపించుకున్న ఈ పార్టీ వ్యూహాత్మకంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. నలుగురు ఎంపీలను గెలుచుకోవడం అంటే మాటలు కాదని తెలిసిన నాయకులు.. పార్టీని కొంత అభివృద్ధి చేస్తే.. ఇక, దూసుకుపోవడం ఖాయమని భావిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల సమయంలో తమకు పరోక్షంగా సాయం చేసిన వారిని పార్టీలోకి నేరుగా ఆహ్వానించడంతోపాటు కేసీఆర్‌ ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేయడం, తెలంగాణ ప్రజల ప్రధాన డిమాండ్లపై దృష్టి పెట్టడం ద్వారా అనుకున్న లక్ష్యం సాధించాలని నిర్ణయించింది. 


అదే సమయంలో కేసీఆర్‌ వైఖరితో ఆ పార్టీలో కీలకమైన నాయకులు ఇప్పుడు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు.వీరిలో కడియం శ్రీహరి వంటి ఎస్సీ నాయకులు కూడా ఉన్నారు. వీరిని సాధ్యమైనంత వరకు తమవైపు తిప్పుకోవడంతోపాటు రాష్ట్రంలో బీజేపీ పగ్గాలను సీనియర్‌ నాయకుడు, తెలంగాణకే చెందిన వ్యూహకర్త మురళీధరరావుకు అందించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ పెద్దలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ వ్యూహానికి రానున్న కొద్ది రోజుల్లోనే పదును పెట్టాలని నిర్ణయించారు. ఇదే జరిగితే.. ఇక, కేసీఆర్‌కు దినదినమూ గండమేనని అంటున్నారు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేసీఆర్‌ ఎలా తట్టుకుని ముందుకు సాగుతారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: