జనసేన అధినేత పవన్ కల్యాణ్  నియంతగా మారిపోతున్నారా ? పార్టీలో తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాజమండ్రిలో పవన్ సోదరుడు నాగుబాబు మాట్లాడుతూ పార్టీలో పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ప్రశ్నించవద్దంటూ గట్టిగా చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు అధినేతకు విధేయుడు అనిపించుకోరని చెప్పటం విచిత్రంగా ఉంది.


పవన్ ఏం చెప్పినా గుడ్డిగా అనుసరించేవారే నిజమైన విధేయుడనిపించుకుంటారంటూ చెప్పటంతో పార్టీలో కలకలం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ ఒంటెత్తు పోకడలను ప్రశ్నిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన పోటి చేసిన 140 సీట్లలో కేవలం ఒక్కసీటు మాత్రమే గెలిచిన విషయం అందరకీ తెలిసిందే. పవన్ అయితే పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

 

పార్టీతో పాటు పవన్ కూడా ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయారో వెంటనే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. అదే సమయంలో అద్దేపల్లి శ్రీధర్ లాంటి నేతలు పవన్ నాయకత్వాన్నే ప్రశ్నిస్తున్నట్లుగా లేఖలు రాస్తున్నారు. దాంతో పార్టీలో అంతర్గతంగా ఉన్న గొడవలన్నీ రోడ్డున పడుతున్నాయి.

 

బహుశా ఈ విషయాలను దృష్టింలో ఉంచుకునే నాగుబాబు అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుంది. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారంటూ బ్రహ్మాండంగా పవన్ భజన మొదలుపెట్టారు. పవన్ నిర్ణయాలను తానైతే ప్రశ్నించనని కాబట్టి మిగిలిన వారు కూడా ప్రశ్నించకూడదని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

పవన్-నాగుబాబు అంటే సోదరులు కాబట్టి బాగానే ఉంటుంది. మిగిలిన వారి పరిస్ధితి అది కాదు కదా ? పైగా ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ తనను మాత్రం పార్టీలో ఎవరూ ప్రశ్నించకూడదని కోరుకుంటున్నారు. పవన్ ను పార్టీలో ఎవరూ ప్రశ్నించకూడదని కోరుకుంటే మరి ఇతర పార్టీల నేతలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు పవన్ కు ఎక్కడిది ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: