ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం బిజీ బిజీగా గ‌డిపారు. అమ‌రావ‌తి నుంచి న‌గ‌రానికి చేరుకున్న జ‌గ‌న్ హైద‌రాబాద్ విచ్చేసిన సంద‌ర్భంగా వ‌రుస‌గా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియమాకం చేసిన తరువాత రాష్ట్ర గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సంద‌ర్భంగా కాసేపు గ‌వ‌ర్న‌ర్‌తో వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. 


అనంత‌రం, ప్రగతి భవన్‌కు చేరుకున్న‌ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ‌, ప‌రిపాల‌న సంబంధ‌మైన అంశాలు చ‌ర్చుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలతో పాటు, నీటి పంపకాలపై చర్చించిన‌ట్లు స‌మాచారాం. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో త్వరలో చేపట్టనున్న యాగం విశేషాలను సీఎం కేసీఆర్ జగన్‌తో పంచుకున్నారని స‌మాచారం. దీంతో పాటుగా రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర చ‌ర్చించిన అంశాల‌ను సైతం వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఈ సంద‌ర్భంగా పంచుకున్న‌ట్లు తెలుస్తోంది. వైఎస్ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌, టీడీపీ స్పందిస్తున్న తీరు సైతం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.


కాగా, ఈ స‌మావేశం అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ జెరుస‌లేం వెళ్ల‌నున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం సాయంత్రం శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జెరుసలేం బయల్దేరనున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు జెరుసలేంలో పర్యటించనున్న వైఎస్ జగన్ ఫ్యామిలీ...ఈ నెల 5వ తేదీన తిరిగి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోనుంది. వైఎస్ జ‌గ‌న్‌ వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన పర్యటనగా అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: