అన్న క్యాంటీన్లపై దుమారం ఓ స్థాయిలో చెలరేగుతోంది. పేదల కోసం మేము పెట్టాం వారి డొక్క మారుతారా అంటూ నారా లోకేష్ నుంచి మిగతా టీడీపీ నాయకుల వరకూ అంతా గట్టిగానే తగులుకుంటున్నారు. జనాల్లో కూడా ఏ అంశానికీ రాని మద్దతు దీని వస్తోంది. కారణం అన్న క్యాంటీన్లలో అయిదు రూపాయలకే భోజనం, అల్పాహరం అందించడం. దీంతో ఇపుడు అన్న క్యాంటీన్ల మూసివేత అన్నది జనంలో బాగానే వెళ్ళిపోయింది. ఓ విధంగా రెండు నెలల జగన్ పాలనలో రాని చెడ్డ పేరు ఈ ఒక్క అంశంలో వచ్చిందనే చెప్పాలి.


అన్న క్యాంటీన్ల పేరిట ఏడాది క్రితం టీడీపీ శ్రీకారం చుట్టింది. అసలు హామీ ఇచ్చింది 2014 ఎన్నికల సందర్భంగా. కానీ అమలు చేసింది మాత్రం ఎన్నికల ఏడాదిలో మాత్రమే. ఇక అక్షయ పాత్రకు ఈ బాధ్యతలు అప్పగించారు. దానికి గానూ చెల్లించాల్సిన మొత్తం ఈ జూలై నెలాఖరు నాటికి 72 కోట్ల వరకూ ఉంది. ఆ బాకీని కొత్త ప్రభుత్వం చెల్లించకపోవడంతో క్యాంటీన్లు ఆటోమ్యాటిక్ గా మూతపడ్డాయి. 


అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పసుపు రంగు, ఓ వైపు అన్న గారు, మరో వైపు చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న క్యాంటీన్లను కావాలనే జగన్ సర్కార్ తీసేసిందని విమర్శలు వస్తున్నాయి.  జనాలతో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్న ఇష్యూ కావడంతో ఇది వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మరో వైపు వామపక్షాలు కూడా అన్న క్యాంటీన్లను  కంటిన్యూ చేయాలంటూ కలెక్టరేట్ల వద్దా ఆందోళనలను నిర్వహించాయి.


ఇక టీడీపీ అయితే అసలు వూరుకోవడం లేదు. దీని మీద మంత్రి బొత్స సత్యనారాయణ కూడా  వివరణ ఇచ్చారు. అన్న క్యాంటీన్లను కొనసాగిస్తామని, కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈసారి అవి రాజన్న క్యాంటీన్లుగా జనంలోకి వస్తాయన్న మాట. ఇక అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ మాదిరిగా  వ్రుధా చేస్తూ ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా ప్రజలకు, అసలైన పేదలకు అవసమయ్యే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో వైసీపీ సర్కార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. మరి చూడాలి. ఇంతలోనే రేగిన ఈ దుమారాన్ని జగన్ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: