ఏపీ సర్కారు గ్రామీణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.. అర్హత ఉండీ రేషన్ కార్డు లేని నిరుపేదలకు అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేషన్‌ కార్డులు లేని పేదల నుంచి గ్రామ సచివాలయాల్లో అర్జీలు తీసుకొని విచారణ చేసి అర్హులైన వారికి మూడు రోజుల్లోగా కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు.


ఈ కొత్త రేషన్ కార్డుల కార్యక్రమం అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్నట్లు నాని తెలిపారు. అంతే కాదు.. అక్టోబర్ నుంచి రేషన్ సరుకులు ఇళ్ల కే గ్రామ వాలంటీర్ల ద్వారా అందిస్తామని వెల్లడించారు. ఆయన విజయవాడలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాపు లో పాల్గొన్నారు.


నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా బియ్యాన్ని ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతతో నిర్వహించాలని మంత్రి నాని కోరారు. మంత్రి చెప్పిన ప్రకారం కొత్త రేషన్ కార్డుల మంజూరు వ్యవహారం బాగానే ఉంది. కానీ రేషన్ కార్డుల ప్రక్షాళన జరపాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో విచ్చలవిడిగా.. నిబంధనలు పాటించకుండా.. బంధుప్రీతితో ఇష్టారాజ్యంగా రేషన్ కార్డులు మంజూరు చేసిన విషయం తెలిసిందే..


అలాంటి బోగస్ కార్డులను ఏరివేయకుండా.. కొత్తగా కార్డులు మంజూరు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు సర్కారుకు ఖజానా భారం తడిసిమోపెడవుతుంది. ఏ ప్రభుత్వ పథకం అమలు చేయాలన్నా రేషన్ కార్డు ఓ ప్రామాణిక పత్రంగా తయారైన నేపథ్యంలో ఈ కార్డుల జారీ పారదర్శకంగా నిక్కచ్చిగా జరగాల్సి ఉంది. మరి జగన్ సర్కారు.. ఇంత నిక్కచ్చిగా ఉండగలుగుతుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: