జాతీయ గీతం విన్నా....త్రివర్ణ పతాక రెపరెపలు వీక్షించినా...ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతుంది. 
మువ్వన్నెల జెండా కనిపిస్తే..... కొందరి చెయ్యి దానంతటదే సెల్యూట్‌ చేస్తుంది. 
భారతజాతి ఆశల్ని, ఆశయాల్ని అంతలా ప్రతిబింబించే త్రివర్ణపతాకానికి.. రంగు, రూపం ఇచ్చిన జక్కన్న మన పింగళి వెంకయ్య.! 
ఆ మహనీయుడి జయంతి నేడు.

మన దేశ నలుమూలలా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. దేశంలోని హిందూ, క్రిస్తు, ముస్లిం మతాలను కలుపుతూ మత బేధాలకు తావులేకుండా జెండాను రూపొందించారు. కాషాయం హిందువులకు, తెలుపు క్రైస్తవలుకు, ఆకుపచ్చ రంగును ముస్లింకు ప్రతీకలుగా , ఈ మూడు రంగుల మధ్యలో ఉన్న అశోక చక్రాన్ని ధర్మం వైపు అడుగులు వేసే విధంగా రూపొందించారు. అయితే ఆయన కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో 1878, ఆగస్టు రెండో తేదీన హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు.

ఆయన ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ చేయడానికి కొలంబో వెళ్లారు. చొరవ, సాహసం మూర్తీభవించిన ఆయన ముంబయి వెళ్లి 19వ ఏట సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో బోయర్‌ యుద్ధంలో పాల్గొన్నారు. లాహోర్‌లోని ఆంగ్లో వేద పాఠశాలలో సంస్కృత, ఉర్దూ, జపనీస్‌ భాషలు అభ్యసించారు. ఆయన భావజాలవేత్త, భాషావేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయితగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేవారు. 1913లో ఆయన జపనీస్‌ భాషలో పూర్తి నిడివితో ప్రసంగించి అందరి ప్రశంసలందుకున్నారు. అందుకే ఆయనకు జపాన్‌ వెంకయ్య, పత్తి వెంకయ్య అనే పేర్లతో పిలిచేవారు.
 
19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే పింగళి వెంకయ్య ఆఫ్రికాలో మహాత్మాగాంధీని తొలిసారి కలిశారు. అప్పటి నుంచి 50 ఏళ్లపాటు వారి అనుబంధం కొనసాగింది. పింగళి వెంకయ్య గాంధేయ సూత్రాలపై నమ్మకంతో మహాత్ముడిని కలిశారు. 1918-1921 మధ్య జరిగిన కాంగ్రెస్‌ సెషన్స్‌లో వెంకయ్య పాల్గొని భారతీయులకు సొంత జెండా ఉండాల్సిన ఆవశ్యకతపై ప్రస్తావించారు. అప్పటికి ఆయన మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నారు. మరోసారి విజయవాడలో గాంధీని కలిసినప్పుడు తాను రూపొందించిన జాతీయ జెండాను వివిధ డిజైన్లలో చూపించారు. వాటిని చూసి అంగీకరించిన మహాత్ముడు.. 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో మరో కొత్త డిజైన్‌ను రూపొందించాలని పింగళి వెంకయ్యకు సూచించారు.

అయితే  తొలుత కుంకుమ, ఆకుపచ్చ రంగులతో జాతీయ జెండాను రూపొందించిన వెంకయ్య తర్వాత దాని మధ్యలో తెలుపు రంగును జోడించి మధ్యలో చక్రం పొందుపర్చారు. ఈ మూడు రంగుల జెండాను 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మహాత్మగాంధీ ఆమోదించారు. జాతీయజెండా తొలిసారి మన విజయవాడలోనే రెపరెపలాడింది. 1963లో మరణించిన పింగళి వెంకయ్య స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన పోరాటాల కంటే జాతీయ జెండా రూపశిల్పిగానే జాతి ఏటా గర్వంగా గుర్తు చేసుకుంటోంది. 2009లో ఆయన జ్ఞాపకార్థం తపాళా బిళ్లను జారీ చేశారు. ఆయనకు భారతరత్న బిరుదు ఇవ్వాలని 2012లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిఫార్సు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: