ఏపీలో ఇపుడు వైసీపీ పటిష్టంగా ఉంది. ఓ విధంగా తిరుగులేని స్థితిలోనే ఉంది. చేతిలో అధికారం ఉండడంతో పార్టీని మరింతగా బలోపేతం చేస్తుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో వైపు జగన్ టార్గెట్ కూడా అదే. హామీలను తీర్చడంతో పాటు, అన్ని వర్గాల్లో గట్టి ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏపీలో ఎదురులేదని చెప్పాలన్నది యువ ముఖ్యమంత్రి ఆలోచన‌గా కనిపిస్తోంది.


ఇదిలా ఉండగా ఏపీలో ఇపుడు బీజేపీ కొంత హడావుడి చేస్తోంది. ఆ పార్టీ నుంచి వచ్చారు, ఈ పార్టీ  నుంచి చేరుతున్నారంటూ ప్రతీ రోజూ గట్టిగా మాట్లాడుతోంది. దీన్ని గమనించిన వైసీపీ తాను కూడా రెడీ అంటూ తాజాగా  సంకేతాలు ఇస్తోంది. తాము వూరుకోబట్టే కొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో ఏ రాజకీయ నేత అయినా మొదట వైసీపీ తలుపే తడుతున్నాడని వారు అంటున్నారు.


అయితే జగన్ వారిని చేరదీయకపోవడంతోనే వెనక్కుపోతున్నారని చెబుతున్నారు. ఈ విషయం మీద సీనియర్లు జగన్ కి చెప్పారట. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడమే కాకుండా ప్రతీ ఎన్నికనూ ఏకపక్షంగా గెలుచుకోవాలంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని సూచించారట. టీడీపీ ఎంత దెబ్బ తిన్నా ఆ పార్టీకి నలభయి శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారట.  అందువల్ల రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషించారట.  ఎక్కడ టీడీపీ బలంగా ఉందో చూసి అక్కడ నుంచి నేతలను వైసీపీలో చేర్చుకోవాలని అది పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని కూడా వివరించారట. 


జగన్ సైతం దానికి సరేనని అన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ  నుంచి బయటకు వెళ్ళిన 23 మంది మాజీ ఎమ్మెల్యేలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని కూడా జగన్ని వారు కోరారట.  దీనిని కూడా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే మొత్తానికి మొత్తం టీడీపీ ఖాళీ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ గేట్లు ఎత్తేస్తే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీలోకే క్యూ కడతారని, ఆ విధంగా చేయడం వల్ల ఏపీలో తాము పెద్ద తోపు అని చెప్పుకొవడానికి బీజేపీకి అవకాశం లేకుండా చేయవచ్చునని కూడా అంటున్నారు. 


వైసీపీలో చేరేందుకు ఇప్పటికిపుడు టీడీపీ పెద్ద తలకాయలన్నీ రెడీగా ఉన్నాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో బీజేపీ ఎదగనీయకూడదని, అలాగే టీడీపీకి కూడా మళ్ళీ తలెత్తుకుని లేచే అవకాశం ఉండకూడదని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. ఆ దిశగానే రాబోయే రోజుల్లో వైసీపీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.  జగన్ విదేశీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: