'' ఈ రోజు రేషన్‌ ఇస్తున్నారు.. అందరూ వెళ్లి తెచ్చుకోండహో ...'' అంటూ, ఊర్లో డప్పు కొడుతూ... టముకు వేస్తే, ఆరోజు కూలీపనులు ఆపుకొని రేషన్‌ షాపుల ముందు లైన్లు కట్టేవారు. ఆ సరుకులు మోసుకొని తెచ్చుకోవడానికి, వికాలాంగులు ,నడవలేని ముసలి వారు నరకయాతనకు లోనయ్యేవారు !!
ఇదంతా గతం.
ఇపుడు ఈ కష్టాలు తీరే కొత్త సంప్రదాయం మొదలైంది. వై.ఎస్‌.జగన్‌ పాదయాత్రలో అలా కష్టాలు పడుతున్న వారిని స్వయంగా చూసి చలించిపోయాడు. రేషన్‌ సరుకుల కోసం పేదోడు అన్ని బాధలు పడాలా ? అని, మానవీయ కోణంతో ఆలోచించి , వారి తలుపు తట్టి రేషన్‌ సరుకులు ఇస్తామని హామీ ఇచ్చాడు. మాట తప్పకుండా,అధికారంలోకి రాగానే చేసి చూపించబోతున్నారు.


శ్రీకాకుళం లో శ్రీకారం !!
తెల్లరేషన్‌ కార్డులున్న పేదలందరికీ నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి, వారి ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించ బోతుంది. సెప్టెంబర్‌ 1న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్యాకెట్లలో బియ్యం పంపిణీ చేయనున్నారు. 5, 10, 20 కిలోల బియ్యం ప్యాకెట్లను తయారు చేసే యంత్రాలను దశలవారీగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదీ, ప్రణాళిక అక్టోబర్‌లో విజయనగరం, నవంబర్‌లో పశ్చిమ గోదావరి, డిసెంబర్‌లో ప్రకాశం, వచ్చే ఏడాది జనవరిలో కర్నూలు, ఫిబ్రవరిలో అనంతపురం, మార్చిలో నెల్లూరు జిల్లాల్లో పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వైఎస్సార్‌, తూర్పు గోదావరి, విశాఖ, క్రిష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి ప్యాకెట్లలో బియ్యం పంపిణీ అమలు చేస్తారు.


రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు...
రాష్ట్రంలో 1.47 కోట్ల తెల్ల రేషన్‌ కార్డులుండగా, ఇందులో 30 లక్షల కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి.అలాంటి వారు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునేందుకు వీలు కలిపిస్తున్నారు. అయితే, వీరు గ్రామ వలంటీర్ల ద్వారా కాకుండా రేషన్‌ షాపుల వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. లైవ్‌ ట్రాకింగ్‌ బియ్యం దారి మళ్లకుండా, లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే బియ్యం ప్యాకెట్లు అందుతున్నాయా? లేదా? అనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. బియ్యం ప్యాకెట్లను వలంటీర్లు స్టాక్‌ పాయింట్ల వద్ద ఎప్పుడు తీసుకున్నారు, లబ్దిదారులకు ఎప్పుడు పంపిణీ చేశారో తెలుసుకునేందుకు లైవ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.


బయట అమ్మితే, చర్యలు
''ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తాం. రాబోయే రోజుల్లో స్వర్ణ, 1121 రకం, నెల్లూరు సన్న బియ్యం పంపిణీ చేస్తాం. సెప్టెంబర్‌ 1న శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం చేరవేస్తాం. వలంటీర్లకు పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.500 ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించాం. '' అంటున్నారు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి, శశిధర్‌.


3 నెలలకోసారి టెండర్లు
'' బియ్యం సంచుల కోసం ఆన్‌లైన్‌లో బిడ్లను ఆహ్వానించాం. ఇప్పటికి 73 బిడ్లు వచ్చాయి. తక్కువ ధర కోట్‌ చేసిన కంపెనీకి ప్యాకెట్ల సరఫరా బాధ్యతను అప్పగించాం. 5 కిలోల సంచికి రూ.9, 10 కిలోల సంచికి రూ.10, 20 కిలోల సంచికి రూ.14గా ధర నిర్ధారించాం. ఈ టెండర్‌ను ప్రస్తుతం రెండు నెలలకు మాత్రమే పిలిచాం, పారదర్శకత కోసం ప్రతి మూడు నెలలకోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెలా 1.67 కోట్ల సంచులు అవసరమవుతాయి..'' అని అధికారులంటున్నారు.


ప్రజలు ఏమంటున్నారు..?
రేషన్‌ బియ్యాన్ని ఇంటి వద్దకే చేర్చే ఈ పథకం పై ప్రజాభిప్రాయాన్ని ' ఏపీ హెరాల్డ్‌ ' సేకరించింది .
'' రేషన్‌ సరుకులు కోసం మూడు మైళ్లు నడిచిపోవాల్సి వచ్చేది. దీనివల్ల ఒక రోజు కూలీపని పోయేది. ఇపుడు మా ఇళ్ల దగ్గరకే బియ్యం పంపుతామని ప్రభుత్వం అంటుంది. ఇంత కంటే సంతోషం ఏముంది ? మా పేదల కష్టాలు తెలుసుకొని , ఇంత గొప్పగా ఆలోచిస్తున్న జగన్‌ బాబు చల్లగా ఉండాలి.' అంటున్నారు, శ్రీకాకుళం జిల్లా, సీతంపేట మండలం, పొల్ల గ్రామం లోని కూరంగి నాగేశ్వరరావు.


 '' మేం ముసలితనం వల్ల నడవ లేని స్ధితిలో ఉన్నాం. రేషన్‌ సరుకులు తెచ్చుకోవడానికి, ఎవరో ఒకరిని బతిమలాడుకొని,ఎంతో కొంత చేతిలో పెట్టి తెప్పించుకునే వాళ్లం. ఇపుడీ కష్టాలు తీరుతున్నాయని , మా ఇంటి మందుకే బియ్యం ప్యాకెట్‌లు వస్తాయని అంటున్నారు. ఈ కార్యక్రమం మా జిల్లా నుండి మొదలవడం చాలా సంతోషం. ఇది మేమెప్పుడూ ఊహించ లేదు. జగన్‌ గారికి రుణపడి ఉంటాం...'' అంటున్నారు శ్రీకాకుళం మండలం, భైరివాని పల్లెకు చెందిన నారాయణమ్మ 


'' గతంలో రేషన్‌ బియ్యంలో కల్తీ కలిసేది. తూకంలో మోసాలు జరిగేవి.. ఇదేంటని డీలర్‌ని అడిగితే , తరువాత నెల రేషన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడు. ఇపుడు అలాంటి సమస్యలు లేకుండా సంచుల్లో ప్యాక్‌ చేసి ఇవ్వడం మంచి ఆలోచన. పేదోళ్ల కడుపు నింపడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌గారికి ధన్యవాదాలు.'' అంటున్నారు విజయ నగరం జిల్లా ,కొండాలక్ష్మీపురం గ్రామస్తుడు సింహాద్రి.   ఇలా మరో నాలుగు జిల్లాలో ఇరవై మందిని ఫోన్‌లో పలకరించగా దాదాపు సానుకూలంగా స్పందించడమే కాక .ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించ లేదని ఇదే పద్దతి కొనసాగించాలి అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: