తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కీల‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ద‌క్కేలా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. జెరూసలెం యాత్రకు వెళ్తున్న జగన్.. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు దాదాపు మూడుగంటలపాటు చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాలు, గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. చర్చలు ముగిసిన అనంతరం జగన్ విదేశీ పర్యటన విజయవంతం కావాలని సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ ఇద్ద‌రు సీఎంల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో కీల‌క అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. జూన్‌ 28న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికన గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించేందుకు ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధికారులు పలు దఫాలు సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ప్రాధమిక ప్రతిపాదనలు వారు సిద్ధం చేశారు. ఏపీ అధికారులు మూడు ప్రతిపాదనలను రూపొందించగా.. తెలంగాణ అధికారులు రెండింటిని తయారు చేశారు. వీటిపై వారు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి కూడా వచ్చారు. తాజాగా కేసీఆర్‌, జగన్‌ భేటీలో ఆయా ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. 


రాష్ట్ర విభజన సమస్యలతోపాటు నీటి పంపకాలు, ముఖ్యంగా గోదావరి జలాల తరలింపు అంశంపైన్నే వారు సుదీర్ధంగా చర్చించినట్టు తెలిసింది. ఈ జలాలను శ్రీశైలానికి ఎలా తరలించాలి? ఎక్కడి నుంచి తరలించాలి? అందుకయ్యే వ్యయమెంత..? నిధులు ఎలా సమకూర్చుకోవాలనే అంశాలపై ప్రధానంగా సమాలోచనలు చేశారు. దీంతోపాటు ఏపీ పునర్విభజన చట్టంలో అపరిషృతంగా ఉన్న అంశాలపైనా వారు చర్చించినట్టు సమాచారం. గత సమావేశం అనంతరం ఆయా సమస్యలపై ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కసరత్తులు మొదలు పెట్టగా వాటిలో ఏయే అంశాల్లో ఎలాంటి ఇబ్బందులున్నాయి? వాటికి పరిష్కారాలేంటి..? అనే అంశాలపైనా ఇరువురు సీఎంలూ చర్చించారు. ప్రధానంగా 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన అంశాలతోపాటు విద్యుత్‌ బకాయిల అంశం కూడా చర్చకు వచ్చింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల పంపకం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈనెల 8న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన అంశాలపై జరగనున్న అధికారుల సమీక్షా సమావేశం గురించి కూడా కేసీఆర్‌, జగన్‌లు చర్చించారు. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ భేటీలో చర్చించాల్సిన అంశాల అజెండాను సైతం ఖరారు చేసినట్టు తెలిసింది. స్థూలంగా కీల‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ద‌క్కేలా...ఈ భేటీ జ‌రిగింద‌ని స‌మాచారం.
1


మరింత సమాచారం తెలుసుకోండి: