పాజిటివ్ ఓటింగ్ కోసం ముందూ వెనుకా చూసుకోకుండా హామీలిచ్చారు. బాండ్ పేపర్ లు సైతం రాసిచ్చారు. దాంతో ఓటర్లు ఆశీర్వదించడంతో ప్రత్యర్థి బలంగా ఉన్న ఈజీగా గట్టెక్కేశారు. అయితే 5 రోజుల్లో నెరవేరుస్తారన్న హామీని రెండు నెలలు దాటినా పట్టించుకోలేదు సదరు ఎంపిగారు. సమస్యను పరిష్కరించకుండా రివర్స్ లో అదే సమస్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారట. దాంతో అక్కడి వారంతా రగిలిపోతూ రివర్స్ పంచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. అరవింద్ అనే నేను నిజామాబాద్ ఎంపీ గా గెలిస్తే మీకు ఐదురోజుల్లో పసుపుబోర్డు తీసుకొస్తాను. లేకుంటే రాజీనామా చేసి అది పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాడుతా. ఇది లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు రైతులకు బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీ.



ఆయన సినిమా రేంజ్ లో అంత గట్టిగా చెప్పడమే కాకుండా ఆ హామీకి సంబంధించి బాండ్ పేపర్ లు కూడా రాసివ్వటంతో రైతులు ఆయనని నమ్మారు. ఆయనకు అండగా నిలిచారు. సిట్టింగ్ ఎంపీ కవితను కాదని తొలిసారి గెలుస్తున్న ఆయన్ని గెలిపించుకున్నారు. అరవింద్ నిజామాబాద్ ఎంపీ గా గెలిచి రెండు నెలలు దాటింది. అయినా ఇప్పటి వరకూ ఆయన పసుపుబోర్డు ఊసే ఎత్తకపోవడం రైతులు రగిలిపోతున్నారు. గెలిచిన వెంటనే అంత పెద్ద సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేక పోయినా ఐదురోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఆయన మరి కొంత సమయం కావాలని  అడుగుతుండడంపై రైతులు గుర్రుగా ఉన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఆయన వ్యవహారం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



తమ సమస్య పరిష్కారానికి ఎంతవరకైనా వెళ్లాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు పసుపు రైతులు. ఇచ్చిన హామీ ప్రకారం మాజీ ఎంపీ కవిత తమకు భరోసా కల్పించక పోవటంతో కవితను కాదని అరవింద్ కు అండగా నిలిస్తే ఇప్పుడాయన కూడా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు చెప్పుకొస్తున్నారు. తమకు పార్టీలు ముఖ్యం కాదని తమ సమస్య పరిష్కారమే ప్రధానమంటున్నారు. ఇటీవల ఢిల్లీలో పసుపు రైతుల సమస్యకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంపై సైతం రైతులు అసహనంతో కనిపిస్తున్నారు. అసలు సమస్యకు పరిష్కారం చూపకుండా పసుపుబోర్డు ప్రస్తావనే లేకుండా కేవలం కాలయాపన కోసం సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




ఎన్నికల హామీ ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు వేయకపోతే ఆగస్టు పదిహేను నుంచి మళ్లీ ఉద్యమ బాట పట్టాలని పసుపు రైతులు నిర్ణయించుకున్నారు.పసుపు, ఎర్రజొన్న రైతుల విషయంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత టీఆర్ ఎస్ రైతులను మోసం చేస్తే పార్లమెంటు ఎన్నికల తర్వాత బిజెపి మోసం చేసిందని రెండు పార్టీలు ఒకటేనని రైతులు విమర్శిస్తున్నారు. కనీసం పసుపు రైతులు ఆందోళనలు చేసిన సమయంలో రైతు నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయించే ప్రయత్నాలు కూడా బిజెపి నాయకులు చేయటం లేదని ఆరోపిస్తున్నారు.



తమ అండతో గెలిచిన బిజెపి ఇప్పుడు పట్టించుకోక పోవడం ఎంత వరకు సబబు అని నిలదీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతం పసుపు ఎర్రజొన్న రైతుల గురించి చెప్పనవసరం లేదు. వారు అనుకున్న సమస్య పరిష్కారం కాకపోతే ఎంత వరకూ వెళ్లడానికైనా వెనుకాడరు,దానికి ప్రత్యక్ష ఉదాహరణ లోకసభ ఎన్నికలే. ఎర్రజొన్న, పసుపు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పార్లమెంటు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏకంగా పదిసార్లు జాతీయ రహదారుల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆ ఆందోళనలు అప్పట్లోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కొందరు రైతు నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా రైతులు వెనుకడుగు వేయలేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ ఉద్యమం ఆపేది లేదని ప్రకటించారు.



అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఏకంగా నూట ఎనభై మంది రైతులు పోటీలో నిలిచి జాతీయ స్థాయిలో తమ సమస్యను ఫోకస్ చెయ్యగలిగారు. ఒక్క నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచే కాదు వారణాసిలో మోదీ పై పోటీకి సైతం సిద్ధమయ్యారు. అయితే అక్కడి స్థానిక పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది బరిలో నిలవలేకపోయారు. వారణాసిలో పోటీ చేసిన ఒక్క రైతుకు ఐదు వందల పై చిలుకు ఓట్లు వస్తే నిజామాబాద్ లోక్ సభ స్థానం బరిలో నిలిచిన రైతులకు తొంభై తొమ్మిది వేల వరకూ ఓట్లొచ్చాయి. అది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ విజయానికి దోహదపడింది. అంతమంది రైతులు పోటిలో లేకుంటే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయం ఉంది. ఏదేమైనా బీజేపీ విజయానికి ప్రధాన కారణం రైతులే అటువంటి వారిని గెలిచిన తరువాత ఎంపీ అరవింద్ విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య పరిష్కరించకపోవడంతో రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టాలని డిసైడ్ అయ్యారు. ఆ ఎఫెక్ట్ ఇపుడిపుడే బయటపడుతున్న తమ పార్టీ పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అని బెంబేలెత్తుతున్న ఏటా బిజెపి శ్రేణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: