ఆయన సినీ మాస్టార్. బెత్తం పట్టి పాఠాలు బోధించిన బడిపంతులు మాదిరిగానే సినిమా పరిశ్రమకు వచ్చే వారికి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇచ్చిన నటనలో నాలుగు కాలాల పాటు పేరు నిలుపుకునేలా చేసిన ఘనత ఆయనది. దేవదాస్ కనకాల పేరు వినగానే ఎన్నో గుర్తుకువస్తాయి. ఆయన 70 దశకంలో మంచి నటుడు. అపుడే ఇండస్ట్రీకి వచ్చిన యువ కెరటం. దానికి ముందు ఆయన నాటకాల అనుభవం కూడా ఉంది.


దేవదాస్ కనకాలలోని  టాలెంట్ ని  చాలా వరకూ  వాడుకున్నది ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాధ్ అని చెప్పాలి. ఓ సీత కధ సినిమాలో దేవదాస్ కనకాల వేసిన పాత్ర నిజంగా మరపురానిది. కొత్త విలనీని ఆయన ఈ మూవీలో చూపించారు. ఓ రకంగా ఆయన పాత్ర చుట్టూనే అల్లుకున్న కధగా ఆ సినిమా ఉంటుంది. ఇక కే విశ్వనాధ్ మరో మూవీ ప్రేమబంధంలో కూడా విలన్ గా దేవదాస్ కనకాల నటించారు. జయప్రదకు జంటగా ఆయన అందులో కనిపిస్తారు. విశ్వనాధ్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టిన సిరిసిరిమువ్వ సినిమాలో కూడా ఆయనది విలన్ పాత్రే. ఆ పాత్రకు కూడా ఆయన ప్రాణం పోశారు ఇలా నటనలో మెట్లు ఎక్కుతూనే ఫిల్మ్ఇనిస్టిట్యూట్  లో పాఠాలు చెప్పేవారు.


ఆయనకు అక్కడ రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి స్టూడెంట్స్ దొరికారు. వారికి నటనలో ఓనమాలు దిద్దించి సూపర్ స్టార్లుగా  చేసిన ఘనత ఆయనదే. ఇక తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా దేవదాస్ కనకాల డైరెక్షన్  డిపార్ట్మెంట్లోనూ రాణించారు. ఆయన దర్శకత్వం వహించిన తొలిసినిమా చలి చీమలు ఓ సంచలం. ఈ సినిమాలో మాటలు రాసే అవకాశం మొదటిసారిగా పరుచూరి బ్రదర్స్ కి దక్కింది.  అలాగే 1980 టైంలో ఆయన తీసిన నాగమల్లి మ్యూజికల్ హిట్. అందులోని పాటలు  అమ్రుత గుళికలు. రాజన్ నాగేంద్ర సంగీతం సినిమాకు ప్రాణం. దాని వెనక దేవదాస్ కనకాల అభిరుచి బలంగా ఉంది. ఇక టీవీ సీరియళ్స్ అనేకం ఆయన దర్శకత్వం వహించారు. రాజశేఖర చరిత్ర, డామిట్ కధ అడ్డం తిరిగింది వంటివి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.


హైదరబాద్ లో సొంతంగా ఫిల్మ్ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి ఎంతోమంది వర్ధమాన కళాకారులను తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. ఆయన ఎందరికో  నటన అనే బిక్ష పెట్టాడనే చెప్పాలి. ఎందరో టాలెంటెడ్ ఆరిస్టులను, టెక్నీషియన్లను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన కుమారుడు రాజీవ్ తండ్రి బాటలో నడిచి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. కోడలు సుమ కూడ నంబర్ వన్ యాంకర్.  ఇక దేవదాస్ కనకాలది ప్రేమ వివాహం. ఆయన సతీమణి లక్ష్మీ కనకాల కూడా మంచి నట శిక్షకురాలు.  దంపతులు ఇద్దరూ కలసి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ని తీర్చిదిదిద్దారు. చిరంజీవి సహా సినీ పెద్దలంతా గురువు గారు అని సంభోదించే దేవదాస్ కనకాల మరణం తీరని లోటు. ఆయన లాంటి అజాత శత్రువు లేకుండా పోవడం టాలీవుడ్ కి అతి పెద్ద విషాదమే.


మరింత సమాచారం తెలుసుకోండి: