గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌తో పాటు దాదాపు 15కు పైగా వివిధ థీమ్‌ల‌ను ప్ర‌తిబింభించే 47 అర్బ‌న్ లీవింగ్ థీమ్ పార్కులు రూ. 120 కోట్ల‌తో కొత్త‌గా నిర్మిస్తున్న‌ట్టు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో థీమ్ పార్కుల నిర్మాణంపై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌, థీమ్ పార్కుల డిజైనింగ్ క‌న్స‌ల్టెంట్‌ల‌తో శుక్రవారం మేయ‌ర్ స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌స్తుతం ఉన్న ఇందిరా పార్కు, వెంగ‌ళ‌రావు పార్కు, కృష్ణ‌కాంత్ పార్కు, చాచా నెహ్రూ పార్కుల అనంత‌రం న‌గ‌రంలో మేజ‌ర్ పార్కుల నిర్మాణం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన జీవ‌న వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు న‌గ‌రంలో ఒక ఎక‌రానికి పైగా ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి వాటిలో ప్ర‌త్యేకంగా థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 47 స్థ‌లాల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని, వీటిలో రూ. 120 కోట్ల వ్య‌యంతో థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


 న‌గ‌రంలోని అన్ని జోన్‌ల‌ను క‌వ‌ర్‌చేసే విధంగా ఈ పార్కుల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ థీమ్ పార్కుల్లో స్వ‌చ్ఛ హైద‌రాబాద్ ఇతివృత్తాన్ని తెలిపే 12 పార్కుల‌ను జోన్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ స్వ‌చ్ఛ థీమ్ పార్కుల్లో త‌డి, పొడి చెత్త సేక‌ర‌ణ‌, సేంద్రీయ ఎరువ‌ల త‌యారీ, ఇంకుడు గుంత‌ల నిర్మాణం, ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌, డంప్‌యార్డ్‌ల క్యాపింగ్ ప‌నులు, సాఫ్, షాన్‌దార్ హైద‌రాబాద్‌ల‌లో చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల‌ను తెలుసుకునే విధంగా ఈ పార్కుల నిర్మాణాన్ని చేప‌డుతున్న‌ట్టు రామ్మోహ‌న్ తెలిపారు. నాలుగు నెల‌ల్లోగా ఈ పార్కుల నిర్మాణాన్ని పూర్తిచేయాల‌ని అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ అధికారుల‌ను మేయ‌ర్ ఆదేశించారు. 


స్వ‌చ్ఛ‌త పార్కుల‌తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌, ట్రాఫిక్ సంబంధిత, రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్‌, చిల్డ్ర‌న్స్ పార్కు, తెలంగాణ సంస్కృతి, యూనివ‌ర్స‌ల్ థీమ్ పార్కు, సైన్స్ పార్కు, రెయిన్ ఫారెస్ట్ థీమ్ పార్కు, అడ్వంచ‌ర్ థీమ్ పార్కు త‌దిత‌ర వినూత్న అంశాల‌తో కూడిన పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు  తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌ల‌కు ప్ర‌త్యేకంగా ఉద్యాన‌వ‌నం లేద‌ని, ఈ ప్ర‌తిపాదిత 47 పార్కుల్లో చిల్డ్ర‌న్స్ థీమ్ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి పార్కు చుట్టూ వ‌ర్ష‌పునీరు నిల్వ ఉండేలా ప్ర‌త్యేక క‌ద‌కం ఏర్పాటు చేయ‌డంతో పాటు వ‌ర్ష‌పునీరు ఇంక‌డంతో పాటు వాటిని నిల్వ చేసుకునేందుకు భారీ ట్యాంక్‌ను భూగ‌ర్భంలో నిర్మించాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ సూచించారు.


 జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ ఈ పార్కుల నిర్మాణ‌ అంచ‌నా వ్య‌యాల‌ను వెంట‌నే రూపొందించి జీహెచ్ఎంసీ జ‌న‌ల‌ర్ బాడీలో ఆమోదంలో పొందేలా ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ పార్కుల‌కు స‌మీపంలోని ఎస్‌.టి.పిల ద్వారా వ‌చ్చే నీటిని నిర్వ‌హ‌ణ‌కు వినియోగించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి థీమ్ పార్కును స‌మీపంలోని పాఠ‌శాల విద్యార్థినీవిద్యార్థులు సంద‌ర్శించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఈ పార్కుల్లో ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాల ద్వారా ప్ర‌త్యేక థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేయాల్సిందిగా న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఐటీ కంపెనీల‌ను కోర‌నున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు.

ప్ర‌తి పార్కుల్లో న‌గ‌ర స్వ‌చ్ఛ‌త, చ‌రిత్ర, సంస్కృతి, సాంప్ర‌దాయాలను తెలిపే ఆడియో విజువ‌ల్ చిత్రాల‌ను కూడా ప్ర‌ద‌ర్శించాల‌ని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటుచేసిన వాట‌ర్ థీమ్ పార్కు వినూత్నంగా ఉండి ప‌లువురిని ఆక‌ర్షిస్తోంద‌ని, ఇదే మాదిరి ఈ 47 పార్కులకు కూడా ప్ర‌త్యేక డిజైన్లు వారం రోజుల్లోగా రూపొందించి స‌మ‌ర్పించాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ప్ర‌తి పార్కులో స్థానిక స్వ‌యం స‌హాయ‌క బృందాలు ఉత్ప‌త్తిచేసే వ‌స్తువుల విక్ర‌య కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. ఈ పార్కుల ఏర్పాటుకు సంబంధించి అర్భ‌న్ బ‌యోడ‌వ‌ర్సిటీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌, ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌ల‌తో ప్ర‌త్యేకంగా క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: